Virat Kohli a superhuman: ఛేదన రారాజు విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మానవాతీతుడని (Super Human) ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌ వాట్సన్‌  (Shane Watson) అంటున్నాడు. తన చుట్టూ ఉన్న క్రికెటర్లు మెరుగ్గా ఆడేందుకు అతడెంతో కృషి చేస్తాడని పేర్కొన్నాడు. ఒత్తిడిలో ఆడటం ఎంఎస్ ధోనీకి (MS Dhoni) వెన్నతో పెట్టిన విద్యని వెల్లడించాడు. అతడి నరాల్లో మంచు ప్రవహిస్తోందని ఛలోక్తి విసిరాడు. 'ఐసీసీ రివ్యూ'లో వాట్సన్‌ మాట్లాడాడు.


IPL లో షేన్ వాట్సన్ మెరుపులు


ఇండియన్‌ ప్రీమియర్ లీగులో (IPL) అత్యంత విజయవంతమైన విదేశీయుల్లో షేన్‌ వాట్సన్‌ ఒకడు. 2008లో రాజస్థాన్ రాయల్స్‌, 2018లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) తరఫున ఐపీఎల్‌ ట్రోఫీలు ముద్దాడాడు. 147 మ్యాచుల్లో 3874 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు బాదేశాడు. అంతేకాకుండా బంతితోనూ రాణించి 92 వికెట్లు తీసుకున్నాడు. 2016, 2017 సీజన్లలో అతడు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు (Royal Challengers Bangalore)ఆడాడు. 2018లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు చేరుకున్నాడు. ఓపెనర్‌గా మెరుపులు మెరిపించాడు. గతేడాది అతడు లీగ్‌ క్రికెట్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.


Virat Kohli అద్భుతం


'ఒక నాయకుడిగా విరాట్‌ కోహ్లీ అద్భుతాలు చేశాడు. తన చుట్టూ ఉండే ఆటగాళ్లందరి శక్తిసామర్థ్యాలను మరింత వెలికితీసేవాడు. అతడిపై అంచనాల ఒత్తిడి ఎంతో ఎక్కువగా ఉండేది. అయినప్పటికీ అందుకు తగ్గట్టే ప్రతి మ్యాచులో ఆడేవాడు. నా వరకైతే విరాట్‌ కోహ్లీ మనిషే కాదు! అతడో మానవాతీత శక్తి. అతడు చాలా మంచోడు. మైదానం ఆవల చక్కగా ఉంటాడు. అతడికున్న నాలెడ్జ్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఆర్‌సీబీలో విరాట్‌ కోహ్లీతో కలిసి ఆడటం గొప్ప అనుభవం' అని వాట్సన్‌ అన్నాడు.


ఒత్తిడి తీసేసే MS Dhoni


ఎంఎస్‌ ధోనీ పెట్టే నమ్మకమే ఆటగాళ్లను రాణించేలా చేస్తుందని వాట్సన్‌ అంటున్నాడు. 'ఎంఎస్‌ ధోనీ నరాల్లో మంచు ప్రవహిస్తుంది! జట్టు మొత్తంపై ఉన్న ఒత్తిడిని అతడు చిటికెలో తీసేస్తాడు. అతడు తన క్రికెటర్లను నమ్ముతాడు. ప్రతి ఒక్కరు వారి సామర్థ్యాలను నమ్మేలా చేస్తాడు. తనకు, తన చుట్టూ ఉన్నవారికి ఏది పనిచేస్తుందో అతడికి బాగా తెలుసు. మైదానంలో ఎప్పుడెలా ఆడాలో, ఏం చేయాలో, ఏ పరిస్థితికి తగ్గట్టు ఎలా ఆడాలో ఆటగాళ్లు పరిశోధిస్తారని ధోనీ విశ్వసిస్తాడు' అని వాట్సన్‌ పేర్కొన్నాడు.


షేన్‌ వాట్సన్‌ ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు సహాయ కోచ్‌గా ఉంటాడని తెలిసింది. రికీ పాంటింగ్‌ అతడిని ఒప్పించాడని సమాచారం. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.