IPL 2022 mi vs dc post match celebrations in rcb den virat kohli dance viral video : ఐపీఎల్‌ 2022లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్న నాలుగు జట్లేవో తెలిసిపోయింది. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇప్పటికే నాకౌట్‌కు చేరుకున్నాయి. దిల్లీ క్యాపిటల్స్‌పై ముంబయి విజయం అందుకోవడంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అర్హత సాధించేసింది.


నెగెటివ్‌ రన్‌రేట్‌ ఉండటంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శనివారం రాత్రి 11 గంటల వరకు టెన్షన్‌గానే ఉంది. అందుకే ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ వారికి కీలకంగా మారింది. పంత్‌ సేనపై రోహిత్‌ జట్టు గెలవాలని మనసారా కోరుకుంది. వారు గెలవగానే అంబరాన్ని అంటేలా సంబరాలు చేసుకుంది.


ముంబయి, దిల్లీ మ్యాచ్‌ను ఆర్సీబీ ఆటగాళ్లంతా కలిసి తమ డెన్‌లోనే వీక్షించారు. టాస్‌ దగ్గర్నుంచి ఏం జరుగుతుందా అని ఆత్రుగా కనిపించారు. డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ మార్ష్‌ ఔటైనప్పుడు వారి ఆనందానికి అవధుల్లేవ్‌. ఒక్కో వికెట్‌ పడుతుంటే వారిలో ఆనందం రెట్టింపు అయింది. ఇక ఛేదనలో టిమ్‌ డేవిడ్‌ కొట్టే ప్రతి సిక్సర్‌, బౌండరీని ముంబయిని మించి ఆస్వాదించారు. ఖలీల్‌ అహ్మద్‌ నోబాల్‌ వేయడం, ఆ తర్వాత బౌండరీతో ముంబయి విజయం అందుకోవడంతో అరుపులు, కేకలతో ఆర్సీబీ డెన్‌ మార్మోగింది.


విరాట్‌ కోహ్లీ అయితే తనే సొంతంగా మ్యాచ్‌ గెలిపించినంత సంబరపడ్డాడు. ఎగిరి గంతులు వేశాడు. ఇక మాక్స్‌వెల్‌ చల్లని బీర్‌ను ఆస్వాదిస్తూ చిందులు వేశాడు. మిగతా ఆటగాళ్లు, సహాయ బృందం, కుటుంబ సభ్యులు పండగ చేసుకున్నారు. ఈ వీడియోను ఆర్సీబీ అభిమానులతో పంచుకుంది. ఇప్పుడది వైరల్‌గా మారింది.




మ్యాచ్‌ ఎలా సాగిందంటే?


ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విషాదం ఎదురైంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


ఎక్కడా ఒత్తిడి పడకుండా...
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (2: 13 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇషాన్ కిషన్ (48: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (37: 33 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో వీరు కూడా అవుటయ్యారు.


ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోయినా... దారుణంగా విఫలం కూడా కాకపోవడంతో ముంబై ఎక్కడా తడబడలేదు. సాధించాల్సిన రన్‌రేట్ 12కి పైగా ఉన్న దశలో టిమ్ డేవిడ్ (34: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కొట్టాల్సిన స్కోరు బాగా తగ్గిపోయింది. 19వ ఓవర్లో తిలక్ వర్మ (21: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అవుటైనా... రెండు బౌండరీలతో రమణ్ దీప్ సింగ్ (13 నాటౌట్: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) మ్యాచ్ ముగించాడు.