Rishabh Pant: ముంబయి ఇండియన్స్‌ బిగ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌పై రివ్యూ తీసుకోకపోవడానికి రిషభ్ పంత్‌ కారణం చెప్పాడు. అంతర్‌ వృత్తంలోని ఫీల్డర్లు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారని పేర్కొన్నాడు. ఎవరూ ఆత్మవిశ్వాసంతో కనిపించకపోవడంతోనే సమీక్ష కోరలేదని వెల్లడించాడు. ముంబయి చేతిలో ఓటమి పాలయ్యాక రిషభ్ మీడియాతో మాట్లాడాడు.


159 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి అంత సౌకర్యంగా కనిపించలేదు. దిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడమే ఇందుకు కారణం. చాలా సందర్భాల్లో గేమ్‌ను వారు తమవైపుకు తిప్పారు. అయితే కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చేసిన ఒకే ఒక్క పొరపాటు వారి ప్లేఆఫ్స్‌ ఆశలను చిదిమేసింది.


బిగ్‌ హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ ఆడిన తొలి బంతికే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్నాడు. శార్దూల్ ఠాకూర్‌ వేసిన తొలి బంతి అతడి బ్యాటుకు అంచుకు తగిలి రిషభ్ పంత్‌ చేతుల్లో పడింది. అయితే అంపైర్‌ ఔటివ్వడంలో విఫలమయ్యాడు. ఆ పరిస్థితుల్లో పంత్‌ కచ్చితంగా రివ్యూకు వెళ్తాడనే అంతా భావించారు. కానీ అతడలా చేయలేదు. దాంతో ఆశ్చర్యపోవడం అందరి వంతూ అయింది.


దిల్లీ ఆటగాళ్లంతా రిషభ్ పంత్‌ దగ్గరికి వచ్చారు. ఏదో మాట్లాడారు. సర్ఫరాజ్‌ ఖాన్‌ అయితే కెప్టెన్‌ను ఒప్పించేందుకు గట్టిగానే ప్రయత్నించినట్టు కనిపించింది. పంత్‌ మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయాడు. ఆ తర్వాత అల్ట్రాఎడ్జ్‌లో చూస్తే స్పైక్‌ వచ్చినట్టు రిప్లేలో కనిపించింది. తప్పుచేశానని తెలుసుకున్న పంత్‌ నిరాశ చెందాడు. ఆ తర్వాత టిమ్‌ డేవిడ్‌ ఎడాపెడా సిక్సర్లు, బౌండరీలు బాదుతూ 35 పరుగులు చేశాడు.


'టిమ్‌ డేవిడ్‌ తొలి బంతి ఆడినప్పుడు ఏదో అనిపించింది. రివ్యూ తీసుకుందామా అని అడిగాను. అంతర్‌వృత్తంలో నిలబడ్డ ఫీల్డర్లు ఎవరూ కాన్ఫిడెంట్‌గా చెప్పలేదు. దాంతో నేను రివ్యూకు వెళ్లలేదు' అని పంత్‌ అన్నాడు. ఏదేమైనా మరోసారి దిల్లీ క్యాపిటల్స్‌ కప్‌ గెలుచుకొనే అవకాశం మిస్‌ చేసుకుంది.