IPL Mega Auction 2022: ఐపీఎల్ వేలంలో టీమ్‌ఇండియా అండర్-19 హీరోలు జాక్‌పాట్ కొట్టేశారు. ఒకరిద్దరు కుర్రాళ్లు రూ.కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు దక్కించుకున్నారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారారు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బవా కోసం పంజాబ్ కింగ్స్ రూ.2 కోట్లు వెచ్చించింది. అతడి సహచరుడు రాజ్‌వర్దన్ హంగర్‌గెకర్ కోసం చెన్నై సూపర్‌కింగ్స్ రూ.1.5 కోట్లు చెల్లించింది. ఇక అండర్-19 కెప్టెన్ యశ్ ధుల్‌ను దిల్లీ క్యాపిటల్స్ కేవలం రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
రాజ్ అంగద్ బవా । Raj Bawa
అనుకున్నట్టుగానే రాజ్ అంగద్ బవా కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ నువ్వా నేనా అన్నట్టుగా బిడ్ వేశాయి. దాంతో రూ.20 లక్షల కనీస ధర రూ.60 లక్షలు, ఆపై కోటి, అక్కడి నుంచి రూ.1.8 కోట్లు, 1.9 కోట్లకు చేరుకుంది. చివరికి పంజాబ్ రూ.2 కోట్లతో దక్కించుకుంది.
క్రీడాకారుల కుటుంబం నుంచి వచ్చాడు రాజ్ అంగద్ బవా. ఎడమచేత్తో బ్యాటింగ్, కుడిచేత్తో పేస్ బౌలింగ్ వేయడంలో ఇతడు దిట్ట. వినోద్ మన్కడ్, ఛాలెంజర్స్ ట్రోఫీల్లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆసియాకప్‌లో 8 వికెట్లతో మెరిశాడు. అండర్-19 ప్రపంచకప్‌లో ఉగాండాపై 108 బంతుల్లో 162 పరుగులతో అజేయంగా నిలిచి శిఖర్ ధావన్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇక ఇంగ్లాండ్‌పై ఫైనల్లో దుమ్మురేపాడు. 9.5 ఓవర్లలో 31 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బకొట్టాడు. టాప్ ఆర్డర్ త్వరగా ఔటవ్వడంతో టీమ్‌ఇండియాను గెలిపించేందుకు 35 పరుగులు చేశాడు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
రాజ్‌వర్ధన్ హంగర్ గెకర్ । Rajvardhan Hanagargekar
రూ.30 లక్షల కనీస ధరతో వచ్చిన రాజ్‌వర్ధన్ హంగర్‌గెకర్ కోసం మొదట ముంబయి బిడ్ వేసింది. ఆ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్ రంగంలోకి దిగింది. రూ.కోటి వరకు ముంబయి, సీఎస్‌కే వరుసగా బిడ్ వేశారు. చివరికి రూ.1.5 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ అతడిని దక్కించుకుంది. ఐసీసీ అండర్ -19 ప్రపంచకప్‌లో హంగర్‌గెకర్ 140 కి.మీ వేగంతో బంతులు వేసి ఆకట్టుకున్నాడు. రాజ్‌వర్ధన్ మహారాష్ట్ర తరఫున 5 లిస్ట్-ఏ, 2 టీ20లు ఆడాడు. వినోద్ మన్కడ్ ట్రోఫీలో 8 మ్యాచుల్లో 133 స్ట్రైక్‌రేట్‌తో 216 పరుగులు చేశాడు. 19 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌లో 8 వికెట్లు తీయడమే కాకుండా 194 పరుగులు చేశాడు. మైకేల్ హోల్డింగ్స్ అంటే ఎంతో ఇష్టం. కొవిడ్ 19 వల్ల 2020లో తండ్రిని కోల్పోయాడు.
యశ్ ధుల్ । Yash Dhull
టీమ్‌ఇండియాను టోర్నీ సాంతం అద్భుతంగా నడిపించాడు కెప్టెన్ యశ్ ధుల్. టోర్నీలోనే కరోనా బారిన పడ్డ అతడు తిరిగొచ్చాక దంచికొట్టాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై వరుసగా అర్ధశతకాలు సాధించాడు. ఇక సెమీస్‌లో అతడు చేసిన శతకానికి చాలామంది సీనియర్ క్రికెటర్లు ఫిదా అయ్యారు. వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం అందించాడు. ఇంగ్లాండ్‌పై ఫైనల్లో కీలకంగా నిలిచాడు. ఈ యువ ఆటగాడికి దిల్లీ క్యాపిటల్స్ రూ.50 లక్షలు చెల్లిస్తోంది.