IPL 2022, LSG Team review: ఐపీఎల్‌ పదిహేనో సీజన్లో (IPL 2022) అత్యంత ఫర్‌ఫెక్ట్‌గా కనిపిస్తున్న జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants)! పేరుకే కొత్త ఫ్రాంచైజీ కానీ ఐపీఎల్‌ 2022 వేలానికి సూపర్‌ ప్లానింగ్‌తో వచ్చింది. డ్రాఫ్ట్‌ ప్లేయర్లను పిక్‌ చేయడం నుంచి ఆటగాళ్లను కొనుగోలు చేయడం వరకు పక్కా ప్లానింగ్‌ కనిపించింది. పేపర్‌ పైన అద్భుతంగా కనిపిస్తున్న కేఎల్‌ రాహుల్‌ సేన (KL Rahul) మరి మైదానంలో ఎలా ఆడనుంది? ప్లేఆఫ్‌ అవకాశాలు ఎలా ఉన్నాయి? బలహీనతలు ఏంటి?


నిజంగా సూపర్‌!


లక్నో సూపర్‌ జెయింట్స్‌ కన్నా ముందు ఆర్పీ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ గురించి మాట్లాడుకోవాలి. ప్రతిదీ పక్కా ప్లానింగ్‌ చేసే వ్యాపార సంస్థ ఇది! పైగా రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్స్‌ను నడిపించిన అనుభవం ఉంది. గౌతమ్‌ గంభీర్‌ను మెంటార్‌గా ఎంపిక చేయడం, విదేశీ లీగుల్లో కోచింగ్‌ అనుభవం ఉన్న ఆండీ ఫ్లవర్‌ను కోచ్‌గా తీసుకోవడమే గొప్ప వ్యూహం! వీరి ప్లానింగ్‌ ఐపీఎల్‌ వేలంలో ప్రతిబింబించింది. ప్రపంచంలోనే బెస్ట్‌ టీ20 ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌, బెస్ట్‌ టీ20 ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టాయినిస్‌ను డ్రాఫ్ట్‌ ప్లేయర్లుగా ఎంపిక చేయడంతోనే వీరి పనితనం కనిపించింది. ఇక వేలంలో ఎనిమిది మంది ఇంటర్నేషనల్‌ ఆల్‌రౌండర్లను తీసుకోవడం ఓ అద్భుతం. టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌, బౌలింగ్‌, ఫాస్ట్‌, స్పిన్‌ అన్నింటా బలంగా ఉందీ జట్టు!


ఎటాకింగ్‌ గేమే మంత్రం!


ఐపీఎల్‌ వేలంలో ఒక్క పైసా  మిగిల్చలేదు లక్నో. ఒక జట్టుకు ఏం అవసరమో అన్నీ సమకూర్చుకున్నారు. అన్ని బేసెస్‌ కవర్‌ చేశారు. ఎటాకింగ్‌ గేమ్ రాహుల్‌సేన మంత్రం కానుంది. జట్టులోని ఏ ఒక్కరూ వెనకడుగు వేద్దాం అనేవాళ్లే లేరు. ఏకంగా ఎనిమిది మంది ఇంటర్నేషనల్‌ ఆల్‌రౌండర్లు ఉన్నారు. తుది జట్టులోని నలుగురు పేస్‌ బౌలింగ్‌, నలుగురు స్పిన్‌ బౌలింగ్‌ వేయగలరు. జట్టులో నాలుగో స్థానం నుంచి కిందవరకు అందరూ బౌలింగ్‌ చేస్తారు. ఒకటి నుంచి తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్‌ చేయలగరు. అలాగని ప్రదర్శన మామూలుగా ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు.


LSG Probable XI


లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్లుగా కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌ (Quinton de Kock) ఉంటారు. వీరిద్దరిదీ కుడి, ఎడమ కాంబినేషన్‌. ఇద్దరూ ఎటాకింగ్‌ గేమ్‌ ఆడతారు. డికాక్‌ సిక్సర్లు దంచుతుంటే రాహుల్‌ 20 ఓవర్లు క్రీజులో నిలవగలడు. వన్‌డౌన్‌లో మనీశ్‌ పాండే (Manish Panday)కు ఛాన్స్‌ ఉంటుంది. గంభీర్‌ (Gautam Gambhir) సారథ్యంలో అతడు బెస్ట్‌ గేమ్‌ను బయటకు తీశాడు. ఇప్పుడూ ఇదే జరగొచ్చు. పైగా కెప్టెన్‌ రాహుల్‌ అతడి ఫ్రెండ్‌. 4-7 వరకు మార్కస్‌ స్టాయినిస్‌ (Marcus Stoinis), దీపక్‌ హుడా (Deepak Hooda), కృనాల్‌ పాండ్య (Krunal Pandya), జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) ఆడతారు. వీళ్లవీ కుడిఎడమ కాంబినేషన్లే. స్టాయినిస్‌ మీడియం పేస్‌ వేస్తాడు. ఓపెనింగ్‌ నుంచి ఫినిషర్‌ వరకు పాత్రలు పోషిస్తాడు. హుడా ఫించ్‌ హిట్టర్‌. పైగా ఆఫ్‌ స్పిన్‌ వేస్తాడు. కృనాల్‌ లెఫ్ట్‌ హ్యాండర్‌. బ్యాటింగ్‌, స్పిన్‌ బౌలిగ్‌ చేస్తాడు. హోల్డర్‌ బ్యాటింగ్‌, ఫాస్ట్ బౌలింగ్‌ చేస్తాడు. కృష్ణప్ప గౌతమ్‌ (Krishnappa Gowtham) ప్రధానంగా స్పిన్నర్‌. సిక్సర్లు బాదగలడు. మార్క్‌వుడ్‌ (Mark Wood) ఇండియన్‌ పిచ్‌లపైనా విపరీతమైన పేస్‌ జనరేట్‌ చేస్తాడు. అవసరమైతే బ్యాటుతో రాణించగలడు. రవి బిష్ణోయ్‌ (Ravi Bishnoi) లెగ్‌ స్పిన్నర్‌. మిస్టరీ బౌలింగ్‌తో అలరిస్తాడు. అవేశ్‌ ఖాన్‌ (Avesh Khan) గత సీజన్లో ఎలాంటి బౌలింగ్‌ చేశాడో మీ అందరికీ తెలుసు.


రిజర్వు ప్లేయర్లూ బలంగానే


లక్నో జట్టులో బెస్ట్‌ పాసిబుల్‌ లెవన్‌తో సమానంగా రాణించే రిజర్వు ఆటగాళ్లు ఉన్నారు. కరణ్ శర్మ, షాబాజ్‌ నదీమ్‌, కైల్‌ మేయర్స్‌, ఎవిన్‌ లూయిస్‌, మనన్‌ వోరా, దుష్మంత చమీరా, అంకిత్‌ రాజ్‌ఫుత్‌ వంటి క్రికెటర్లు ఉన్నారు. లక్నోలోని చాలామంది ఆటగాళ్లకు ముంబయి, మహారాష్ట్ర పిచ్‌లుపై ఆడిన అనుభవం ఉంది. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌, క్వింటన్‌ డికాక్‌కు వాంఖడే అంటే పిచ్చి! వారి పరుగుల వరద ఈసారి మామూలుగా ఉండదు. కృనాల్‌ పాండ్య ముంబయి ఇండియన్స్‌ నుంచే వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో దీపక్‌ హుడా, అవేశ్‌ ఖాన్‌, కృష్ణప్ప గౌతమ్‌, మనీశ్‌ పాండేకు అక్కడ ఆడిన అనుభవం ఉంది. ఎవిన్‌ లూయిస్‌ గతంలో ముంబయి ఇండియన్స్‌కు ఆడాడు. స్వింగ్‌, స్పిన్‌కు అనుకూలించే అక్కడి పిచ్‌లపై రాణించే ఆటగాళ్లు లక్నోకు ఉన్నారు. సీజన్‌ మొదలు పెట్టకముందే వీరు ప్లేఆఫ్‌ చేరుకుంటారన్న అంచనాలైతే ఉన్నాయి. మరి పేపర్‌పై బలంగా ఉన్న లక్నో మైదానంలో ఎలా ఆడుతుందో చూడాలి!!


Also Read: హిట్‌మ్యాన్‌ ఉండగా భయమేల! కానీ పాండ్య బ్రదర్స్‌ ఫినిషర్స్‌ లోటు తీర్చేదెవరు MI?


Also Read: ధోనీ భాయ్‌ అంతా OK, కానీ జడ్డూ గాయపడితే CSK సిచ్యువేషన్‌ ఏంది?