David Warner set to miss 5-6 matches of IPL:  ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో కొన్ని మ్యాచులు మిస్సయ్యే అవకాశం ఉంది! ఐపీఎల్‌ ఆడినా, ఆడకపోయినా తన ఐడల్‌ షేన్‌వార్న్‌ అంత్యక్రియలకు తప్పకుండా హాజరవుతానని అంటున్నాడు. ఆయన మరణించాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని వెల్లడించాడు.


ఐపీఎల్‌ 2022లో డేవిడ్‌ వార్నర్‌ దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. శిఖర్ ధావన్‌ను పంజాబ్‌ కింగ్స్‌ కొనుగోలు చేయడంతో దిల్లీకి వార్నర్‌ అత్యంత కీలకం. కుడి, ఎడమ ఓపెనింగ్‌ జోడీలో అతడు కచ్చితంగా ఉండాల్సిందే. యువ ఓపెనర్‌ పృథ్వీ షాతో కలిసి వార్నర్‌ ఓపెనింగ్‌ చేయాల్సి ఉంది. అతడు గనక కొన్ని మ్యాచులను మిస్సైతే దిల్లీకి ఇబ్బందికరమే అని చెప్పాలి. బయోబుడగ నిబంధనల ప్రకారం అతడు కనీసం 5-6 మ్యాచులు దూరమైనా ఆశ్చర్యం లేదు.


ప్రస్తుతం డేవిడ్‌ వార్నర్‌ పాకిస్థాన్‌లో ఉన్నాడు. కొన్నేళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు అక్కడ పర్యటిస్తోంది. రావల్పిండిలో జరిగిన మొదటి టెస్టులో వార్నర్ హుషారుగా కనిపించాడు. మైదానంలో డ్యాన్సులు చేస్తూ, బాడీ ఊపుతూ అభిమానులను అలరించాడు. లాహోర్‌లో జరిగే మూడో టెస్టు మార్చి 25న ముగుస్తుంది. అది కాగానే అతడు ఆస్ట్రేలియా బయల్దేరుతాడు. మార్చి 30న జరిగే తన చిన్ననాటి ఐడల్‌ షేన్‌వార్న్‌ అంత్యక్రియల్లో పాల్గొనాలని అనుకుంటున్నాడు.


మార్చి 26 నుంచే ముంబయిలో ఐపీఎల్‌ 15వ సీజన్‌ మొదలవుతోంది. అదే సమయంలో వార్నర్‌ ఆస్ట్రేలియా వెళ్లి తిరిగి రావడానికి కొన్ని రోజులు పడుతుంది. పైగా కరోనా వల్ల బయో బుడగలోకి వచ్చేందుకు కొన్ని రోజులు క్వారంటైన్‌ తప్పదు. అలాంటప్పుడు దిల్లీ ఆడే 5-6 మ్యాచులకు వార్నర్‌ ఉండకపోవచ్చు.


ఐపీఎల్‌ 2022 వేలానికి ముందు డేవిడ్‌ వార్నర్‌ (David Warner) భారీ ధర పలుకుతాడని అంచనా వేశారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. దిల్లీ క్యాపిటల్స్‌ అతడిని రూ.6.25 కోట్లకే దక్కించుకుంది. నిజం చెప్పాలంటే అతడిని తక్కువ ధరకు కొట్టేసినట్టే అనుకోవాలి!


Delhi Capitals బిడ్‌


వేలంలో డేవిడ్‌ వార్నర్‌ పేరు రాగానే అందరికీ ఆసక్తి కలిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ అతడి కోసం సరదాకైనా ఒకసారి బిడ్‌ వేస్తుందా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆక్షనీరు అతడి పేరు చెప్పగానే ఒక నిమిషం అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మొదట దిల్లీ అతడికి బిడ్‌ వేసింది. వెంటనే చెన్నై సూపర్‌ కింగ్స్‌ రంగంలోకి దిగింది. ఆపై ముంబయి ఇండియన్స్‌ ప్రవేశించింది. దాంతో చూస్తుండానే అతడి ధర రూ.6 కోట్లకు చేరుకుంది. ఆపై దిల్లీ రూ.6.25 కోట్లకు బిడ్‌ వేసింది. తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో అనుకున్న స్థాయి కన్నా తక్కువ ధరకే వార్నర్‌ అమ్ముడుపోయాడు.