ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో తడబడింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ బౌలర్లు రాణించి లక్నోను కట్టడి చేశారు. పంజాబ్ కింగ్స్ విజయానికి 120 బంతుల్లో 154 పరుగులు కావాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. సూపర్ ఫాంలో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను (6: 11 బంతుల్లో, ఒక ఫోర్) రబడ ఇన్నింగ్స్ మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్వింటన్ డికాక్ (46: 37 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), దీపక్ హుడా (34: 28 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. పరిస్థితులకు తగ్గట్లు ఆడి ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. రెండో వికెట్‌కు 59 బంతుల్లోనే 85 పరుగులు జోడించారు.


అయితే కీలక సమయంలో వీరిద్దరూ వరుస ఓవర్లలో అవుట్ కావడంతో లక్నో కష్టాల్లో పడింది. ఆ తర్వాత వచ్చిన కృనాల్ పాండ్యా (7: 7 బంతుల్లో, ఒక ఫోర్), మార్కస్ స్టోయినిస్ (1: 4 బంతుల్లో), ఆయుష్ బదోని (4: 4 బంతుల్లో), జేసన్ హోల్డర్‌లు (11: 8 బంతుల్లో, ఒక సిక్సర్) విఫలం అయ్యారు. దీంతో లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది.


పంజాబ్ బౌలర్లలో కగిసో రబడకు నాలుగు వికెట్లు దక్కాయి. రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీసుకోగా... సందీప్ శర్మకు ఒక వికెట్ లభించింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసుకున్న రబడ ఈ ఘనతను ఐదో సారి సాదించాడు.