IPL 2022 Daniel Vettori sees shades of Chris Gayle in Abhishek Sharma's takedown of Rashid Khan : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్‌ అభిషేక్ శర్మ (Abhishek Sharma)లో క్రిస్‌గేల్‌ (Chris Gayle) షేడ్స్‌ కనిపిస్తున్నాయని న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డేనియెల్‌ వెటోరీ అంటున్నాడు. గుజరాత్‌ టైటాన్స్‌ మిస్టరీ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ (Rashidh Khan) బౌలింగ్‌ను అతడు ఎదుర్కొన్న తీరు బాగుందని ప్రశంసించాడు. చక్కగా బంతుల్ని పిక్‌ చేస్తున్నాడని వెల్లడించాడు.


ఐపీఎల్‌ 2022 తొలి రెండు మ్యాచుల్లో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. దాంతో అతడిపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఇక మూడో మ్యాచులో తప్పక ఆడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఆ ఒత్తిడిని జయించి ప్రస్తుతం దూకుడుగా ఆడుతున్నాడు. ఈ సీజన్లో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 138 పరుగులు చేశాడు. తొలి 6 ఓవర్లలో అతడి స్ట్రైక్‌రేట్‌ సైతం బాగుంటోంది. ఇక గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచులో కేవలం 42 బంతుల్లోనే 65 పరుగులు చేశాడు. అందులోనూ రషీద్‌ వేసిన 15 బంతుల్లోనే 34 పరుగులు రాబట్టాడు. మూడు భారీ సిక్సర్లు దంచాడు.




'అభిషేక్‌ శర్మ ఆటతీరులో ఎంతో ప్రశాంతత ఉంది. రషీద్‌ ఖాన్‌ లెంగ్తుల్ని అతడు ఈజీగా పిక్‌ చేస్తున్నట్టు అనిపించింది. చాలామంది గొప్ప క్రికెటర్లు లెంగ్తులను పసిగట్టే సామర్థ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే రషీద్‌ ఖాన్ కొద్దిగా ఫుల్లర్‌ లెంగ్త్‌ వేయగానే అభిషేక్‌ రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు కొట్టాడు. అతడు ఆర్మ్స్‌ను ఎక్స్‌టెండ్‌ చేసి అడుగు ముందుకేసి బంతిని పిచ్‌అవ్వగానే అందుకున్నాడు. బహుశా క్రిస్‌గేల్‌, సురేశ్ రైనా వంటి క్రికెటర్లు రషీద్‌ బౌలింగ్‌లో అలా ఆడేవారు. బంతిని ఆడేందుకు అదే వారి స్టైల్‌' అని వెటోరీ అన్నాడు.


'ఫుల్లర్‌ లెంగ్తే కాదు కొద్దిగా ఓవర్‌పిచ్‌ బంతివేసినా అభిషేక్‌ ఈజీగా పిక్‌ చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు అలా చేయలేకపోయారు. దీన్ని బట్టి అభిషేక్‌ ఎంత ప్రశాంతంగా ఆడుతున్నాడో చెప్పొచ్చు. రషీద్‌ లెంగ్త్‌ మిస్సైన ప్రతిసారీ అతడు అందిపుచ్చుకున్నాడు. షార్ట్‌పిచ్లో వేసినప్పుడు కవర్స్‌ మీదుగా బాదేశాడు. అలాగే సింగిల్స్‌ తీసుకొనే అవకాశాన్నీ వదులుకోలేదు' అని డేనియెల్‌ వెటోరీ ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోతో చెప్పాడు.