ఐపీఎల్ 2022 సీజన్‌లోని 42వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab kings), లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పుణెలోని ఎంసీఏ క్రికెట్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గతంలో పంజాబ్‌కు నాయకత్వం వహించాడు. అతడి మిత్రుడైన మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) ఇప్పుడు పంజాబ్ కెప్టెన్సీ బాధ్యతలు చూసుకుంటున్నాడు.
లక్నోనే ముందంజలో
లక్నో సూపర్ జెయింట్స్ 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఆడిన 8 మ్యాచుల్లో 5 విజయాలు సాధించింది. హార్డ్ హిట్టర్లనే కొనుగోలు చేసిన పంజాబ్ మాత్రం ఆశించన రీతిలో రాణించడం లేదు. 8 మ్యాచుల్లో 4 గెలిచి మిగతా 4 ఓడింది. నెగెటివ్ రన్‌రేట్ కారణంగా ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి. రాహుల్ తన పాత జట్టుతో తలపడటం, ప్రత్యర్థి కెప్టెన్ మిత్రుడే కావడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది.
మంచి ఫాంలో లక్నో
లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇబ్బందులేమీ కనిపించడం లేదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ రెండు సెంచరీలు చేసి మాంచి జోరుమీదున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో బట్లర్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. క్వింటన్ డికాక్ మరింత నిలకడగా ఆడాలి. మనీశ్ పాండే బాగా ఇబ్బంది పడుతున్నాడు. అతడి స్థానంలో కృష్ణప్ప గౌతమ్ లేదా మనన్ వోరాను తీసుకోవచ్చు. వోరా మూడో స్థానంలో మంచి ఫిట్. అవేశ్ ఖాన్ గాయంపై ఇంకా ఎటువంటి అప్‌డేట్ లేదు. అతడు అందుబాటులో లేకుంటే మొహిసిన్ ఖాన్‌కు అవకాశం దక్కుతుంది. మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, జేసన్ హోల్డర్, కృనాల్ పాండ్య ఆల్‌రౌండ్ నైపుణ్యాలతో జట్టుకు ఉపయోగపడుతున్నారు.
పంజాబ్ గెలవకపోతే కష్టమే
ఇక పంజాబ్ కోరుకున్నది ఒకటి అయితే జరుగుతున్నది మరొకటి. గత మూడు మ్యాచుల్లో వారి ప్రదర్శన అస్సలు బాగాలేదు. ఎవరూ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడటం లేదు. ఓపెనర్ శిఖర్ ధావనే ఆ బాధ్యత తీసుకుంటే బాగుంటుంది. మయాంక్ అగర్వాల్, భానుక రాజపక్స, లియాం లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో రాణించడం లేదు. బౌలింగ్ విషయంలో పంజాబ్ ఫర్వాలేదు. రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, కగిసో రబడ, సందీప్ శర్మ బాగా ఆడుతున్నారు. బ్యాటింగ్ సమస్యలను పరిష్కరించకపోతే పంజాబ్ ఇంటికెళ్లడం ఖాయం.
లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీశ్ పాండే, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టన్, జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రిషి ధావన్, కాగిసో రబాడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ