IPL 2022 kumara sangakkara people around jos buttler came to his rescue : తక్కువ అంచనాలతో ఐపీఎల్‌కు వచ్చానని రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్ (Jos Buttler) అన్నాడు. ఐపీఎల్ 2022 టోర్నీ సాగేకొద్దీ తనలో ఎనర్జీ, ఎక్సైట్‌మెంట్ పెరిగాయని పేర్కొన్నాడు. ఒక గొప్ప జట్టుతో తన ప్రయాణం సాగుతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఇక టోర్నీ ఫైనల్ చేరుకోవడం ఉత్సాహంగా అనిపిస్తోందని వెల్లడించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫయర్ 2లో (RR vs RCB Qualifier 2) బట్లర్ అజేయ శతకం బాదేసిన సంగతి తెలిసిందే.
సీజన్ ఆరంభంలో బౌలర్లను చితకబాదిన బట్లర్‌ను కొన్ని విషయాలు పెడదారి పట్టించాయని బట్లర్ అన్నాడు. వాటిని తనలోనే దాచుకున్నంత వరకు ఒత్తిడి అనుభవించానని పేర్కొన్నాడు. దాంతో కొన్ని మ్యాచుల్లో రాణించలేకపోయానని వెల్లడించాడు. రాజస్థాన్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ కుమార సంగక్కర (Kumar Sangakkara), తన చుట్టూ ఉన్న సన్నిహితులతో వాటిని నిజాయతీగా పంచుకున్నాక ఉపశమనం కలిగిందని తెలిపాడు.
'నా సన్నిహితులతో నిజాయతీగా మాట్లాడాను. కుమార సంగక్కర, అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ అందులో ఉన్నారు. నేను కొంత ఒత్తిడి అనుభవించాను. పెడదారి పట్టాను. దానిని దాచుకొనేందుకు ప్రయత్నించాను. ఓ వారం రోజులు గడిచాక దాని గురించి ఇతరులతో పంచుకున్నాకే మనసు తేలికైంది. మరింత మెరుగైనట్టు అనిపించింది. చాలా రిలాక్స్‌డ్‌గా కోల్‌కతాకు వెళ్లాను. ఆ మ్యాచులో నా ఆట మళ్లీ ఆత్మవిశ్వాసం అందించింది' అని బట్లర్ అన్నాడు.
'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచు ఉత్సాహంగా అనిపించింది. లక్ష మంది ముందు ఆడుతున్నానన్న ఫీలింగ్ అద్భుతం. రెండేళ్లుగా మేం ఖాళీ స్టేడియాల్లో ఆడుతున్నాం. అసలు ఐపీఎల్ అంటేనే ఇది. ఓ అద్భుతమైన స్టేడియం, అవధుల్లేని అభిమానం, తిరుగులేని క్రికెట్ - వీటిని నేను ఎంజాయ్ చేశాను. సాధారణంగా నేను మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆడుతుంటాను. కొన్ని రోజులు నేను నెమ్మదిగా ఉంటాను. నిజానికి నేనెప్పుడూ అలా ఆడాలనుకోను. కఠిన సందర్భాల్లో అప్పుడప్పుడు తప్పదు' అని బట్లర్ వెల్లడించాడు.