ఐపీఎల్‌ 2022లో యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) కోరుకోని రికార్డు సృష్టించాడు. ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన పేసర్‌గా నిలిచాడు. గత సీజన్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన అతడు ఈ సారి వరుస పెట్టి పరుగులు ఇచ్చాడు. హసరంగ, డ్వేన్‌ బ్రావో తర్వాతి స్థానంలో నిలిచాడు.


హైదరాబాదీ పేస్‌ కెరటం మహ్మద్‌ సిరాజ్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఈసారి రూ.7 కోట్లు పెట్టి తీసుకుంది. గతేడాది ప్రదర్శనను చూసి అతడిపై నమ్మకం ఉంచింది. కానీ ఈ సీజన్లో అతడు నిరాశపరిచాడు. ఎక్కువ వికెట్లు తీయలేదు. పైగా భారీగా పరుగులు ఇచ్చాడు. రాజస్థాన్‌ మ్యాచులోనైతే కేవలం రెండు ఓవర్లే వేసి 31 పరుగులు ఇచ్చాడు. దాంతో ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ ఆ తర్వాత బంతినే ఇవ్వలేదు.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్‌గా సిరాజ్‌ ఓ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ 2022లో 31 సిక్సర్లు ఇచ్చాడు. అతడి సహచరుడు, మిస్టరీ స్పిన్నర్‌ వనిందు హసరంగ 30 సిక్సర్లు ఇచ్చాడు. కానీ ఏకంగా 26 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన యుజ్వేంద్ర చాహల్‌ సరసన నిలిచాడు. పైగా అతడి ఎకానమీ రేట్‌ 7.54. అందుకు విరుద్ధంగా సిరాజ్‌ ఎకానమీ 10.07గా ఉంది. కేవలం 9 వికెట్లే తీశాడు. 2022కు ముందు ఒకే సీజన్లో ఎక్కువ సిక్సర్లు ఇచ్చిన రికార్డు డ్వేన్‌ బ్రావో పేరుతో ఉండేది.2018లో 29 సిక్సర్లు ఇచ్చాడు. 


కొన్నేళ్లుగా ఆర్సీబీకి మహ్మద్‌ సిరాజ్‌ ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్నాడు. 2019లో 9 మ్యాచుల్లో 7 వికెట్లే తీసి 169 బంతుల్లో 269 పరుగులు ఇచ్చాడు. ఆ తర్వాత తన బౌలింగ్‌లో లోపాలను సరిదిద్దుకొన్నాడు. టీమ్‌ఇండియా తరఫున రాణించాడు. అదే ఫామ్‌ను 2020, 2021లో చూపించాడు. దుబాయ్‌లో జరిగిన 2020 ఐపీఎల్‌లో 9 మ్యాచుల్లో 8.68 ఎకానమీ, 21.81 సగటుతో 11 వికెట్లు తీశాడు. ఇక 2021లోనూ 15 మ్యాచుల్లో 6.78 ఎకానమీ, 32.09 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. ఈ సారి మాత్రం ఆశించిన మేరకు రాణించలేదు.


ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం రాత్రి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెంచరీ చేసిన జోస్ బట్లర్ (106 నాటౌట్: 60 బంతుల్లో, 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆదివారం జరగనున్న ఫైనల్‌లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.