IPL 2022 Kumar Kartikeya replaces injured Arshad Khan for Mumbai Indians : ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) మరో స్పిన్నర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కుమార్ కార్తికేయను జట్టులోకి తీసుకుంది. గాయపడిన పేసర్‌ అర్షద్ ఖాన్‌ స్థానంలో అతడికి ఎంచుకుంది. ఇప్పటి వరకు ముంబయి ఆడిన మ్యాచుల్లోనైతే అర్షద్‌కు చోటు దక్కలేదు.


కొత్త కుర్రాడు కార్తికేయ మధ్యప్రదేశ్‌ తరఫున 8 టీ20లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు. 2021-22 సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఎంపీ తరఫున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఐదు మ్యాచుల్లో 5.05 ఎకానమీతో 5 వికెట్లు తీశాడు. పొట్టి క్రికెట్టే కాకుండా మధ్యప్రదేశ్‌కు 9 ఫస్ట్‌క్లాస్‌, 19 లిస్ట్‌-ఏ మ్యాచులు ఆడాడు. వరుసగా 35, 18 వికెట్లు తీశాడు. రూ.20 లక్షల కనీస ధరతో ముంబయి అతడిని తీసుకుంది.


ప్రస్తుతం ముంబయిలో మురుగన్‌ అశ్విన్‌, మయాంక్‌ మర్కండే, ఫాబియన్‌ అలన్‌ స్పిన్‌ డిపార్ట్‌మెంటును చూసుకుంటున్నారు. కొత్తగా హృతిక్‌ షోకీన్‌ స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌లో మెరుస్తున్నాడు. ఏదేమైనా ఒకప్పటిలా ముంబయి స్పిన్‌ విభాగం కనిపించడం లేదు. ప్రత్యర్థులను నిలువరించడంలో తేలిపోతున్నారు. వికెట్లు తీయలేకపోతున్నారు. దాంతో భవిష్యత్తు గురించి ఆలోచించిన ముంబయి కొత్త కుర్రాళ్లను తీసుకుంటోంది.


ఐపీఎల్‌ 2022లో ముంబయి ఇండియన్స్‌ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఎనిమిది మ్యాచులు ఆడినప్పటికీ ఒక్కదాంట్లోనూ విజయం అందుకోలేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమవుతోంది. జట్టుకు సమతూకం రావడం లేదు. పేస్‌ బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా తప్ప ఎవరూ రాణించడం లేదు. స్పిన్‌లోనూ అంత పవర్‌, గ్రిప్‌ కనిపించడం లేదు. అందుకే ఇకపై ఆడే మ్యాచుల్లో ముంబయి ప్రయోగాలు చేయనుంది. శనివారం డీవై పాటిల్‌ రాజస్థాన్‌  రాయల్స్‌తో తలపడనుంది.