IPL 2022 SRH vs GT Blower Umran Malik Steals The Show with Five-wicket Haul : సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ సంచలనంగా మారాడు. 145-150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడు. తన భీకరమైన పేస్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. బ్యాటర్ల వికెట్లు ఎగరగొడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో రెండో మ్యాచులో అతడు ఐదు వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. అతడు వికెట్లు తీసిన వీడియో, చిత్రాలు వైరల్‌గా మారాయి.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను ఉమ్రాన్ మాలిక్ తన పేస్‌తో భయపెట్టాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. జట్టు స్కోరు 69 వద్ద శుభ్‌మన్ గిల్ వికెట్ ఎగరగొట్టాడు. ఆఫ్ స్టంప్ మీదుగా వచ్చిన బంతికి గిల్ బీట్ అయ్యాడు. ఇక పదో ఓవర్లో హార్దిక్ పాండ్యను వణికించాడు. అతడు వేసిన బౌన్సర్ బ్యాటు అంచుకు తగిలి థర్డ్‌మ్యాన్‌లో ఫీల్డర్ చేతుల్లో పడింది.
దూకుడు ఆడుతున్న ఓపెనర్ వృద్ధిమాన్ సాహానూ అతడే ఔట్ చేశాడు. 152 కి.మీ వేగంతో వేసిన ఆ బంతికి మిడిల్, లెగ్‌స్టంప్ ఎగిరి పడింది. 16వ ఓవర్లో అయితే ఆఖరి రెండు బంతుల్లో వికెట్లు పడగొట్టాడు. 148 కిలోమీటర్ల వేగంతో వచ్చిన బంతి డేవిడ్ మిల్లర్ లెగ్‌స్టంప్‌ను గాల్లోకి లేపింది. ఆ మరుసటి బంతికే అభినవ్ మనోహర్‌ను పెవిలియన్ పంపించాడు.
SRHపై GT ఛేజ్ ఎలా సాగిందంటే?
ఐదు మ్యాచ్‌ల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
ఆఖరి ఓవర్ దాకా సాగిన థ్రిల్లర్
196 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (68: 38 బంతుల్లో, 11 ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడటంతో పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ వికెట్ నష్టపోకుండా 59 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ (22: 24 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించాడు. మొదటి వికెట్‌కు 69 పరుగులు జోడించిన అనంతరం ఉమ్రాన్ మలిక్ బౌలింగ్‌లో గిల్ అవుటయ్యాడు.
ఈ దశలోనే వృద్ధిమాన్ సాహా అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు సరిగ్గా ఆడకపోవడంతో గుజరాత్ 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లూ ఉమ్రాన్ మలిక్‌కే దక్కడం విశేషం. చివర్లో రాహుల్ తెవాటియా (40: 21 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), రషీద్ ఖాన్ (31: 11 బంతుల్లో, నాలుగు సిక్సర్లు) చెలరేగడంతో గుజరాత్ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.