Virat Kohli Dance: విరాట్‌ కోహ్లీ ఎక్కడున్నా సందడిగా ఉంటుంది! మైదానంలో క్రికెట్‌ ఎలా ఆడతాడో పార్టీల్లో డ్యాన్స్‌ అలాగే చేస్తాడు. అందరితో కలివిడిగా ఉంటాడు. తాజాగా అతడు 'పుష్ఫ' సినిమాలోని 'ఊ అంటావా మామా ఊఊ అంటావా మామా' పాటకు చిందులు వేశాడు. అందరినీ అలరించాడు.


ఈ మధ్యే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు క్యాంపులో ఓ వేడుక జరిగింది. గ్లెన్‌ మాక్స్‌వెల్‌, వినీ రామన్‌ మ్యారేజ్‌ బాష్‌ నిర్వహించారు. బయో బుడగలో ఉన్న అందరు క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. విరాట్‌ కోహ్లీ నల్లరంగు కుర్తాలో అదరగొట్టాడు. అతడి సతీమణి అనుష్కశర్మ గులాబీ రంగు దుస్తుల్లో మెరిశారు.


ఈ వేడుకలో క్రికెటర్లంతా సందడిగా గడిపారు. ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌ చేశారు. ఊ అంటావా పాట రాగానే సహచరులతో కలిసి విరాట్‌ కోహ్లీ డ్యాన్స్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. గురువారం ఈ పార్టీకి సంబంధించిన చిత్రాలను అనష్కశర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా ఐపీఎల్‌ ముందే మాక్సీ, వినీ పెళ్లి చేసుకున్నారు.




క్రికెట్‌ విషయానికి వస్తే ఈ సీజన్లో విరాట్‌ కోహ్లీ ప్రదర్శన నామమాత్రంగా ఉంది. ఒకప్పటిలా పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. పుణె వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో రెండో మ్యాచులోనూ విఫలమయ్యాడు. ఓపెనర్‌గా వచ్చినప్పటికీ స్కోరు చేయలేకపోయాడు. అభిమానులను నిరాశపరిచాడు. వికెట్‌ పడగానే ఏం చేయాలో అర్థంకాక నిర్వేదంలో నవ్వుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.


ఈ సీజన్లో ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లీ అర్ధశతకాలు చేయలేదు. రెండు మూడు సార్లు డకౌట్‌ అయ్యాడు. అతడిని ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు ఆర్సీబీ యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ఓపెనర్‌గా పంపించింది. ఎక్కువ సమయం దొరికితే నిలదొక్కుకుంటాడని భావించింది. అందుకు తగ్గట్టే ఈ మ్యాచులో ఆర్సీబీ ముందు తక్కువ టార్గెట్టే ఉంది. 145 పరుగులు చేస్తే విజయం వరిస్తుంది. దాంతో విరాట్‌ నిలుస్తాడని అభిమానులు ఆశించారు.


అందరి అంచనాలను తలకిందులు చేస్తూ విరాట్‌ 10 బంతులాడి 9 పరుగులకే ఔటయ్యాడు. 2 బౌండరీలు కొట్టాడు. అప్పటికే ట్రెంట్‌బౌల్ట్‌ వేసిన తొలి ఓవర్లో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ రూపంలో రెండుసార్లు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. కానీ రెండో ఓవర్లో ప్రసిద్ధ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. వరుసగా 3 బంతులు డాట్‌ అవ్వడంతో ఎలాగైనా పరుగులు చేయాలని కోహ్లీ అనుకున్నాడు. షార్ట్‌పిచ్‌లో వేసిన బంతి తలమీదుగా వెళ్తుంటే బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడబోయాడు. గాల్లోకి లేచిన బంతిని రియాన్‌ పరాగ్‌ అమేజింగ్‌ డైవ్‌తో క్యాచ్‌ అందుకున్నాడు.