IPL 2022 kuleep yadav like to share mom award with Axar patel : ఐపీఎల్‌ 2022లో చైనామన్ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ (Kuldeep Yadav) దుమ్మురేపుతున్నాడు. బంతితో చక్కని వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. వరుస పెట్టి వికెట్లు పడగొడుతున్నాడు. గత రెండేళ్లుగా ఆత్మవిశ్వాసం కోల్పోయిన అతడికి దిల్లీ క్యాపిటల్స్‌ మళ్లీ లైఫ్‌ ఇచ్చింది. పంజాబ్‌ మ్యాచులో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన అతడు దానిని అక్షర్‌ పటేల్‌తో పంచుకుంటానని అంటున్నాడు. 6 ఓవర్లు వేసిన అతడు 2 వికెట్లు తీసి 24 పరుగులే ఇచ్చాడు.


'నేనీ అవార్డును అక్షర్‌పటేల్‌తో కలిసి పంచుకోవాలని అనుకుంటున్నా. అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మిడిల్‌లో కీలకమైన వికెట్లు తీశాడు. కాగిసో రబాడాకు నేనింతకు ముందు బౌలింగ్‌ చేశాడు. అతడికి ఎక్కువ ఫుట్‌వర్క్‌ ఉండదని తెలుసు. అతడికి ఒక చైనామన్‌ బాల్‌ వేసి తర్వాత గూగ్లీ విసరాలని ప్లాన్‌ చేశాను. ఇక రెండో వికెట్‌ మాత్రం రిషభ్ వల్లే వచ్చింది. రౌండ్‌ ది వికెట్‌ వేయాలని అతడే చెప్పాడు' అని కుల్‌దీప్‌ అన్నాడు.


'ఈ ఐపీఎల్‌ సీజన్‌ నాకెంతో కాన్ఫిడెన్స్‌ ఇచ్చింది. నా పాత్రపై మానసికంగా స్పష్టత తెచ్చుకున్నా. నేనిప్పుడు నా లైన్‌ అండ్‌ లెంగ్త్‌ పైనే ఫోకస్‌ చేస్తున్నా. బ్యాటర్‌ ఏం చేయబోతున్నాడో ఆలోచించడం లేదు. వీడియోలూ చూడటం లేదు. ఎక్కువగా తికమక పడుతున్నప్పుడు బ్యాటర్లు ఏం చేస్తారోనన్న వీడియోలు చూస్తుంటారు. చాలాకాలం తర్వాత నా బౌలింగ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నా. నాకు అండగా నిలిచినందుకు రిషభ్‌ పంత్‌కే ఈ ఘనత చెందుతుంది. కెప్టెన్‌ అండగా నిలిస్తే ఏ బౌలర్‌కైనా కాన్ఫిడెన్స్‌ వస్తుంది. అదే మా జట్టుకు ప్లస్‌ పాయింట్‌' అని కుల్‌దీప్‌ తెలిపాడు.


ఐపీఎల్‌ 2022లో కుల్‌దీప్‌ యాదవ్‌ పర్పుల్ క్యాప్‌కు పోటీ పడుతున్నాడు. 6 మ్యాచుల్లోనే 23.4 ఓవర్లు విసిర 13 వికెట్లు తీశాడు. 14.30 సగటు, 7.85 ఎకానమీ మెయింటేన్‌ చేస్తున్నాడు. ఒక మ్యాచులో 4 వికెట్ల ఘనత దక్కించుకున్నాడు. తొలిస్థానంలో ఉన్న యుజ్వేంద్ర చాహల్‌ (17 వికెట్లు)కు గట్టి పోటీనిస్తున్నాడు. 2019, 2020 సీజన్లలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కుల్‌దీప్‌ ఆడాడు. అక్కడ వరుణ్‌ చక్రవర్తి, సునిల్‌ నరైన్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో జట్టులో చోటు దొరకడం కష్టమైంది. పైగా బౌలింగ్‌లోనూ ఇబ్బంది పడ్డాడు. 2019లో 9 మ్యాచుల్లో కేవలం 4 వికెట్లు తీశాడు. ఇక 2020లో 5 మ్యాచుల్లో ఒక్క వికెట్టే పడగొట్టాడు.