IPL 2022 mi vs csk preview mumbai indians vs chennai superkings  head to head records: ఐపీఎల్‌ 2022లో 33వ మ్యాచులో అత్యంత విజయవంతమైన ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడుతున్నాయి. డీవై పాటిల్‌ స్టేడియం ఇందుకు వేదిక. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా ఉత్కంఠ ఊపేస్తుంది. మరి వీరిలో ఎవరిపై ఎవరిది పైచేయి? తుది జట్లలో ఎవరుంటారు? గెలిచేదెవరు?


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో ఇప్పటి వరకు 14 సీజన్లు జరిగాయి. ముంబయి ఇండియన్స్‌ 5, చెన్నై సూపర్‌కింగ్స్‌ 4 సార్లు విజేతగా ఆవిర్భవించాయి. వీరిద్దరే 9 కప్పులు పంచుకున్నారంటే ఎంత గొప్ప జట్లో అర్థం చేసుకోవచ్చు. అందుకే వీరు తలపడే మ్యాచులను 'ఎల్‌ క్లాసికో' అంటుంటారు. అలాంటిది ఈ సారి ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉన్నాయి. సీఎస్‌కే ఆరు మ్యాచులాడి ఒకటి గెలిస్తే ముంబయి ఏకంగా ఆరుకు ఆరూ ఓడిపోయింది. అందుకే వీరి పోరును ఇప్పుడు ఉనికి చాటుకొనే ప్రయత్నంగా చెబుతున్నారు.


ఐపీఎల్‌ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 32 సార్లు తలపడ్డాయి. ఇన్ని మ్యాచులు మరే రెండు జట్ల మధ్యా జరగలేదు. చెన్నై సూపర్‌కింగ్స్‌పై స్పష్టంగా ముంబయిదే ఆధిపత్యం. ఏకంగా 19 గెలిచింది. ఇక చివరి ఐదు మ్యాచుల్లోనూ ముంబయిదే 3-2తో పైచేయి.


చెన్నై సూపర్‌కింగ్స్‌ను డెత్‌ ఓవర్లలో అడ్డుకొనేందుకు బుమ్రా ఉపయోగపడతాడు. ఎంఎస్‌ ధోనీ, శివమ్‌ దూబెకు అతడిపై మెరుగైన రికార్డు లేదు. ఒకసారి డ్వేన్‌ బ్రావో బాగానే ఆడాడు కానీ మిగతా మ్యాచుల్లో ఇబ్బంది పడ్డాడు. మరోవైపు సీఎస్‌కేపై కీరన్‌ పొలార్డ్‌ బౌలింగ్‌ బాగుంటుంది. ఏకంగా 14 వికెట్లు తీశాడు. మరోవైపు రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ను అడ్డుకోవడంలో రవీంద్ర జడేజా సక్సెస్‌ అయ్యాడు. వీరిద్దరినీ అతడు కంట్రోల్‌లో ఉంచగలడు.


ముంబయి ఇండియన్స్‌: ఇషాన్‌ కిషన్‌, రోహిత్ శర్మ, డివాల్డ్‌ బ్రూవిస్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, కీరన్‌ పొలార్డ్‌ /టిమ్‌ డేవిడ్‌, ఫాబియన్‌ అలన్‌, మురుగన్‌ అశ్విన్‌, జస్ప్రీత్‌ బుమ్రా, తైమల్‌ మిల్స్‌ /రిలే మెరిడీత్‌, జయదేవ్ ఉనద్కత్‌


చెన్నై సూపర్‌కింగ్స్‌: రుతురాజ్‌ గైక్వాడ్‌, రాబిన్‌ ఉతప్ప, మొయిన్‌ అలీ, అంబటి రాయుడు, శివమ్‌ దూబె, ఎంఎస్‌ ధోనీ, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రావో, క్రిస్‌ జోర్డాన్‌ / డ్వేన్‌ ప్రిటోరియస్‌, మహేశ్‌ థీక్షణ, ముకేశ్‌ చౌదరి