Pollard Retirement West Indies cricketer Kieron Pollard announces his retirement from international cricket: కరీబియన్ బిగ్‌మ్యాన్ కీరన్ పొలార్డ్ అభిమానులకు షాకిచ్చాడు! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నానని ప్రకటించాడు. సుదీర్ఘ కాలంగా వెస్టిండీస్ క్రికెట్‌కు అతడు సేవలు అందిస్తున్నాడు. 15 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. మరికొన్నేళ్లు అతడు జాతీయ జట్టుకు సర్వీస్ చేస్తాడని అంతా భావించారు. ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడం, అలసిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అతనిప్పుడు ఐపీఎల్ 2022లో ముంబయి ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.
'అత్యంత జాగ్రత్తగా చర్చించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. అందరు కుర్రాళ్లలాగే నేనూ వెస్టిండీస్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాలని పదేళ్ల వయసు నుంచే అనుకున్నా. 15 ఏళ్లుగా కరీబియన్ జట్టు తరఫున వన్డే, టీ20 క్రికెట్ ఆడినందుకు గర్వపడుతున్నా' అని పొలార్డ్ అన్నాడు.
'రాబోయే యువతరం కోసం నేను పక్కకు జరగాలని అనుకుంటున్నా. కుర్రాళ్లకు వెస్టిండీస్ క్రికెట్లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. నా కెరీర్లో నాకెంతోగానో మద్దతు లభించింది. నా కల నెరవేరినందుకు నేనెంతో కృతజ్ఞతతో ఉన్నాను. వెస్టిండీస్ క్రికెట్‌కు నా బ్యాటుతో వందనం చేస్తున్నా' అని ఎమోషన్‌గా లెటర్ రాశాడు.