IPL 2022, KKR vs MI Match Highlights: ఐపీఎల్‌ 2022లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)కు వరుసగా మూడో ఓటమి ఎదురైంది! డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సీఎస్‌కే బాటలోనే నడిచింది. ఆ జట్టు నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (Kolkata Knightriders) 5 వికెట్ల తేడాతో ఛేదించేసింది. ప్యాట్‌ కమిన్స్‌ । Pat Cummins (56; 15 బంతుల్లో 4x4, 5x6) 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టేయడంతో మరో 4 ఓవర్లుండగానే గెలుపు తలుపు తట్టింది. వెంకటేశ్‌ అయ్యర్‌ । Venkatesh Iyer (50; 41 బంతుల్లో 6x4, 1x6) ఆఖరి వరకు నిలిచాడు. అంతకు ముందు ముంబయిలో సూర్య కుమార్‌ యాదవ్‌ (52; 36 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకం చేశాడు. హైదరాబాదీ తిలక్‌ వర్మ (38*; 27 బంతుల్లో 3x4, 2x6) రాణించారు.


Pat Cummins ఊచకోత


పిచ్‌ కఠినంగా ఉండటంతో కోల్‌కతా ఛేజింగ్‌ మొదట్లో అంత ఈజీ కాలేదు. పక్కగా ప్లాన్‌ చేసిన ముంబయి పేసర్లు అవే గోయింగ్‌ డెలివరీలతో ఓపెనర్లను చికాకు పెట్టారు. తొలి 3 ఓవర్లు పెద్దగా రన్స్‌ ఇవ్వలేదు. జట్టు స్కోరు 6 వద్దే అజింక్య రహానె (7)ను తైమల్‌ మిల్స్‌ ఔట్‌ చేశాడు. రెండు బౌండరీలు బాదిన శ్రేయస్‌ అయ్యర్‌ (10)ని డేనియెల్‌ సామ్స్ పెవిలియన్‌ పంపించాడు.


వికెట్లు పడుతున్నా ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ నిలబడ్డాడు. హాఫ్‌ సెంచరీతో అలరించాడు. ఆచితూచి ఆడుతూనే దొరికిన బంతుల్ని బౌండరీకి పంపించాడు. కాసేపు బిల్లింగ్స్ (17) అతడికి అండగా నిలిచాడు. జట్టు స్కోరు 67 వద్ద అతడిని, 83 వద్ద నితీశ్ రాణా (8) ఒకే తరహాలో మురుగన్‌ అశ్విన్‌ ఔట్‌ చేశాడు. 13.1వ బంతికి ఆండ్రీ రసెల్‌ (11)ను తైమల్‌ మిల్స్‌ ఔట్‌ చేయడంతో కేకేఆర్‌ 101/5తో నిలిచింది. ఈ సిచ్యువేషన్‌లో ప్యాట్‌ కమిన్స్‌ అద్భుతం చేశాడు. రసెల్‌ బదులు అతడు ఊచకోత కోశాడు. వరుసగా పుణెలో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి 14 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేసి కేఎల్‌ రాహుల్‌ రికార్డును సమం చేశాడు. 16 ఓవర్లకే మ్యాచును ముగించేశాడు.




Surya kumary Yadav రాగానే...!


పిచ్‌ కఠినంగా ఉండటం, కేకేఆర్‌ బౌలర్లు చక్కగా బౌలింగ్‌ చేయడంతో ముంబయికి శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 6 వద్ద ఉమేశ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ (3) ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన 'బేబీ ఏబీ' డివాల్డ్‌ బ్రూవిస్‌ (29; 19 బంతుల్లో 2x4, 2x6) మెరుపు బౌండరీలు, సిక్సర్లతో అలరించాడు. కీలక సమయంలో అతడిని వరుణ్‌ చక్రవర్తి పెవిలియన్‌ పంపించాడు. మరికాసేపటికే ఇషాన్‌ కిషన్‌ (14; 21 బంతుల్లో 1x4) ఔటవ్వడంతో ముంబయి 55/3తో కష్టాల్లో పడింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్‌ యాదవ్‌ హైదరాబాదీ తిలక్‌ వర్మతో కలిసి సూపర్బ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 10-12 బంతులాడి సెటిలైన అతడు ఆ తర్వాత సిక్సర్లు, బౌండరీలు కొట్టాడు. తిలక్‌తో కలిసి 49 బంతుల్లో 83 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 34 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. జట్టు స్కోరు 138 వద్ద 19.1వ బంతికి అతడు ఔటయ్యాడు. అయితే ఆఖరి 5 బంతుల్లో 3 సిక్సర్లు కొట్టిన పొలార్డ్‌ (22; 5 బంతుల్లో 3x6) జట్టు స్కోరును 161/4కు చేర్చాడు. తిలక్‌ చూపించిన తెగువను ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సిందే.