IPL 2022, Ravi shastri praises on Tilak varma: హైదరాబాదీ యువ కెరటం తిలక్‌ వర్మపై (Tialk Varma) టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) ప్రశంసలు కురిపించాడు. అతడి బ్యాటింగ్‌, బాడీ లాంగ్వేజ్‌ అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్నాడు. చక్కని షాట్లతో ఈ ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) ఆటగాడు ఆకట్టుకున్నాడని వెల్లడించాడు. 


వేలంలో తిలక్‌ వర్మను ముంబయి ఇండియన్స్‌ రూ.1.7 కోట్లకు దక్కించుకుంది. 19 ఏళ్ల ఈ కుర్రాడు కేవలం రూ.20 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ అతడి కోసం పోటీపడ్డాయి. ముంబయి ఆడిన రెండు మ్యాచుల్లోనూ అతడి ఆట అందరినీ ఆకట్టుకుంది. రాజస్థాన్‌పై కేవలం 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అంతకు ముందు దిల్లీ క్యాపిటల్స్‌పై అరంగేట్రం పోరులో 15 బంతుల్లోనే 22 పరుగులు చేసి ఔరా అనిపించాడు.


'ముంబయి ఇండియన్స్‌కు ఆడిన రెండు మ్యాచుల్లోనూ తిలక్‌ వర్మ తన సామర్థ్యాన్ని బయటపెట్టాడు. అతడి షాట్లు, ఫుట్‌వర్క్‌, బ్యాక్‌ ఫుట్‌, స్వీప్‌ షాట్లు నన్ను ఆకట్టుకున్నాయి. అతడి షాట్‌ సెలక్షన్‌లోనూ ఎంతో వైవిధ్యం ఉంది. ఒక యువ ఆటగాడిలో ఇలాంటి కంపోజర్‌, బాడీ లాంగ్వేజ్‌, టెంపర్‌మెంట్‌ ఉండటం ఎంతో బాగుంది. తిలక్‌ ఇంకా ముందుకెళ్తాడు. అతడి సానుకూల దృక్పథంతో మ్యాచులు ఆడటం ముంబయి ఇండియన్స్‌కు ఓ మంచి శకునం. సూర్యకుమార్‌ వస్తే ముంబయి మిడిలార్డర్‌ మరింత బలంగా మారుతుంది' అని శాస్త్రి అన్నాడు.




అసలు ఎవరీ తిలక్ వర్మ?


తిలక్ వర్మ (19) ఎంతో పేద కుటుంబం నుంచి వచ్చాడు. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు హైదరాబాద్‌లో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నారు. దీంతో తిలక్ క్రికెట్ కోచింగ్‌కు ఖర్చు పెట్టే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో కోచ్ సలాం బయాష్... తిలక్ క్రికెట్ కోచింగ్‌కు అవసరమైనవన్నీ సమకూర్చారు. హైదరాబాద్ తరఫున మూడు ఫార్మాట్లలో తిలక్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఇప్పటివరకు 15 టీ20 మ్యాచ్‌లు ఆడిన తిలక్ 381 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉండగా... స్ట్రైక్ రేట్ 140కి పైగా ఉండటం విశేషం.