IPL 2022, RCB: ఐపీఎల్‌ 2022లో రెండో విజయం తర్వాత రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరులో జోష్‌ కనిపిస్తోంది. రాజస్థాన్‌ రాయల్స్‌పై అనూహ్య విజయం తర్వాత ఆ జట్టు వేడుకలు చేసుకుంది. 'ది గోల్డెన్‌ లయన్‌ షైనింగ్‌ థ్రూ' అంటూ విజయ నినాదాలు చేసింది. తమ థీమ్‌ సాంగ్‌ను పాడుతూ ఆటగాళ్లు ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియోను ఆర్సీబీ ట్విటర్లో ఉంచింది.


ఆర్‌సీబీ పాట ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్టైన మనీ హైస్ట్‌ నేపథ్య గీతాన్ని పోలివుంది! కెప్టెన్‌ డుప్లెసిస్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, దినేశ్‌ కార్తీక్‌ సహా జట్టంతా కలిసి ఈ పాటను ఆలపించారు. ఆ తర్వాత కలిసి డిన్నర్‌ చేశారు.


రాజస్థాన్‌పై మెరుపు షాట్లతో గెలిపించిన దినేశ్‌ కార్తీక్‌ను డుప్లెసిస్‌ ప్రశంసించాడు. ఎంఎస్ ధోనీతో పోల్చాడు. 'వారిద్దరిలోనూ నాకెన్నో సారూప్యతలు కనిపించాయి. ప్రపంచ క్రికెట్లోనే ఎంఎస్ ధోనీ అత్యుత్తమ ఫినిషర్‌. ఈ ఏడాది డీకేలోనే అలాంటి స్థాయే కనిపిస్తోంది. చాలా కాలం నేను డీకే ప్రత్యర్థిగా ఆడాను. అతనెప్పుడూ ప్రమాదకర ఆటగాడే. ఫినిషర్‌గా మాత్రం ఇప్పుడే ఎక్కువగా చూస్తున్నా. అతడిలో క్లారిటీ, కంపోజర్‌, స్కిల్‌ కనిపిస్తున్నాయి' అని డుప్లెసిస్‌ అన్నాడు. మరో ఆటగాడు షాబాజ్‌ అహ్మద్‌నూ పొగిడేశాడు. అతడు చిన్నగా ఉండటంతో చాలామంది సిక్సర్లు కొట్టలేరని భావిస్తారని, కానీ అతడు చాలాదూరం బంతిని పంపించగలడని వెల్లడించాడు.




RR vs RCB మ్యాచ్‌ ఎలా జరిగిందంటే?


RR vs RCB, Match Highlights: ఐపీఎల్‌ 2022లో రాజస్థాన్‌ రాయల్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం చవిచూసింది. 170 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్‌ చేయలేకపోయింది. వికెట్లు పడి రన్‌రేట్‌ పెరిగిన తరుణంలో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ కార్తీక్ (44; 23 బంతుల్లో 7x4, 1x6) ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. షాబాజ్‌ అహ్మద్‌ (45; 26 బంతుల్లో 4x4, 3x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు రాజస్థాన్‌లో జోస్‌ బట్లర్‌ (70; 47 బంతుల్లో 0x4, 6x6), హెట్‌మైయిర్‌ (42; 31 బంతుల్లో 4x4, 2x6) అజేయంగా నిలిచారు. దేవదత్ పడిక్కల్‌ (37; 29 బంతుల్లో 2x4, 2x6) రాణించాడు. 


Dinesh Karthik అటాక్‌


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఛేదన ఇంట్రెస్టింగా సాగింది. ఓపెనర్లు డుప్లెసిస్ (29; 20 బంతుల్లో 5x4), అనుజ్‌ రావత్‌ (26; 25 బంతుల్లో 4x4) దూకుడుగా ఆడారు. పవర్‌ప్లే అడ్వాంటేజ్‌ తీసుకొని ఫీల్డర్ల మీదుగా బౌండరీలు కొట్టారు. దాంతో 6.2 ఓవర్లకే స్కోరు 50 దాటింది. వన్‌సైడ్‌గా మారుతున్న మ్యాచ్‌ను డుప్లెసిస్‌ను జట్టు స్కోరు 55 వద్ద ఔట్‌ చేసి చాహల్‌ బ్రేక్‌ ఇచ్చాడు. మరికాసేపటికే అనుజ్‌ రావత్‌ను సైని ఔట్‌ చేశాడు.అప్పటికి స్కోరు 61. మరో పరుగు వద్దే విరాట్‌ కోహ్లీ (5)ని శాంసన్‌ రనౌట్‌ చేశాడు. డేవిడ్‌ విల్లే (0)ను యూజీ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. రూథర్‌ ఫర్డ్‌ (5) తక్కువకే ఔటవ్వడంతో 87కే ఆర్‌సీబీ 5 వికెట్లు చేజార్చుకుంది. రాజస్థాన్‌ పట్టుబిగించిన సమయంలో దినేశ్‌ కార్తీక్‌ విజృంభించాడు. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదేసి ఊపు తీసుకొచ్చాడు. యాష్‌ వేసిన 14వ ఓవర్లో 21 రన్స్‌ సాధించాడు. రన్‌రేట్‌ను అదుపులోకి తెచ్చాడు. షాబాజ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 33 బంతుల్లో 67 పరుగుల భాగస్వామ్యం అందించాడు. ఆఖర్లో షాబాజ్‌ ఔటైనా మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్ల తేడాతో జట్టుకు విజయం అందించాడు.