IPL 2022, Jonty rhodes touches Sachin tendulkar feet: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL 2022) ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సాధారణంగా సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ను చూస్తే ఈ తరం క్రికెటర్లు కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటారు. వారే కాకుండా అభిమానులు సైతం మైదానంలోకి చొచ్చుకొచ్చి ఈ లెజెండ్‌ పాదాలను తాకుతుంటారు. అయితే ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్‌ కింగ్స్‌ విజయం సాధించిన తర్వాత జరిగిన ఘటన మాత్రం అందరినీ సర్‌ప్రైజ్‌ చేసింది. ఎందుకంటే దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీరోడ్స్‌ తెందూల్కర్‌ పాదాలను తాకాడు.


బుధవారం జరిగిన 23వ మ్యాచులో ముంబయి ఇండియన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఇది ముంబయికి ఐదో మ్యాచ్‌. ఈసారీ వారి అదృష్టం మారలేదు. పంజాబ్‌ కింగ్స్‌ నిర్దేశించిన 199 పరుగుల లక్ష్యాన్ని హిట్‌మ్యాన్‌ సేన ఛేదించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో చాలాసేపు రెండు జట్లు విజయం కోసం ప్రయత్నించాయి. దాంతో పంజాబ్‌ డగౌట్‌లో ఉత్కంఠభరిత వాతావరణం కనిపించింది. పంజాబ్‌ బౌలర్లు వికెట్లు తీస్తున్న ప్రతిసారీ ఆ జట్టు ఫీల్డింగ్‌ కోచ్‌ జాంటీరోడ్స్‌ ఉత్సాహంతో కనిపించారు.


మ్యాచ్‌ ముగిశాక రెండు జట్ల ఆటగాళ్లు, కోచింగ్‌ స్టాఫ్‌ మైదానంలోకి వచ్చారు. ఎప్పట్లాగే హ్యాండ్‌షేక్‌ ఇచ్చుకుంటూ అభినందించుకున్నారు. ఈ క్రమంలో సచిన్‌ రాగానే జాంటీ రోడ్స్‌ అతడి పాదాలకు తాకేందకు ప్రయత్నించాడు. సచిన్‌ రెండు మూడు సార్లు వారించినా ఊరుకోలేదు. తాను అనుకున్నట్టుగానే అతడి పాదాలను తాకి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. పంజాబ్‌కు రాక ముందు జాంటీ ముంబయి ఇండియన్స్‌కే ఆడాడు. వీరిద్దరి మధ్య చక్కని అనుబంధం ఉంది. ఇప్పుడీ వీడియో వైరల్‌గా మారింది.




PBKSపై MI ఛేదన ఎలా సాగిందంటే?


ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ముంబై ఓటముల పరంపర కొనసాగుతోంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది ముంబై ఇండియన్స్‌కు వరుసగా ఐదో ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 186 పరుగులకే పరిమితం అయింది.


ఒత్తిడిలో రనౌట్
ఇక ముంబై ఇండియన్స్‌కు మాత్రం ఆశించిన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ (28: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), ఇషాన్ కిషన్ (3: 6 బంతుల్లో) వరుస ఓవర్లలో అవుటయ్యారు. అనంతరం యువ బ్యాటర్లు డెవాల్డ్ బ్రెవిస్ (49: 25 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), తిలక్ వర్మ (36: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ముంబైని ఆదుకున్నారు. బౌండరీలు కొడుతూ స్కోరును ముందుకు నడిపించారు. అయితే అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు.


అయితే సూర్యకుమార్ యాదవ్‌తో సమన్వయ లోపం కారణంగా కీరన్ పొలార్డ్ (10: 11 బంతుల్లో, ఒక ఫోర్), తిలక్ వర్మ అవుట్ కావడం ముంబైని దెబ్బ తీసింది. సూర్యకుమార్ (43: 30 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) వేగంగా ఆడటానికి ప్రయత్నించినా తనొక్కడే స్పెషలిస్ట్ బ్యాటర్ కావడంతో ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో రబడ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. చివర్లో జయదేవ్ ఉనద్కత్ (12: 7 బంతుల్లో, ఒక సిక్సర్) ఆశలు రేపినా ముంబై విజయానికి ఆ ఊపు సరిపోలేదు.