IPL 2022, Ravindra Jadeja update: రవీంద్ర జడేజా (Ravindra Jadeja) కెప్టెన్సీని తిరిగి ఎంఎస్ ధోనీకి (MS Dhoni) అప్పగించడం సరైందేనని టీమ్‌ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) అన్నాడు. అతడు సహజమైన నాయకుడు కాదన్నాడు. అతడి చూస్తుంటే నీటిలోంచి బయటపడ్డ చేపపిల్లలా అనిపించాడని పేర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ తర్వాత మరో కెప్టెన్‌ను గుర్తించేందుకు చెన్నై సూపర్‌కింగ్స్ కొంత సమయం తీసుకుంటే మంచిదని సూచించాడు.
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాయకత్వ బాధ్యతలను మొదట ఎంఎస్ ధోనీయే చూసుకున్నాడు. సడెన్‌గా తాను నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు. రవీంద్ర జడేజా ఇకపై జట్టును నడిపిస్తాడని వెల్లడించాడు. ఒకరిద్దరు ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడం, వరుస పెట్టి మ్యాచుల్లో ఓడిపోవడంతో జడ్డూ కెప్టెన్సీని వదిలేశాడు. తిరిగి ధోనీకి అప్పగించాడు. ఆ తర్వాత సీఎస్‌కే భారీ స్కోర్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
'జడ్డూ నేచురల్ కెప్టెన్ కాదు. ఏ స్థాయి క్రికెట్లోనూ అతడు నాయకత్వం వహించలేదు. అలాంటి వ్యక్తికి బాధ్యతలు అప్పగించడం జడేజాపై బండను మోపినట్టు అనిపించింది. చాలామంది జడ్డూను జడ్జ్ చేయాలని అనుకోవచ్చు. కానీ ఇది అతడి తప్పు కాదు. అతనెక్కడా కెప్టెన్సీ చేయలేదు. అతడి చూస్తుంటే నీటిలోంచి బయటపడ్డ చేపలా అనిపించాడు. పూర్తిగా విఫలమయ్యాడు. ఒక ఆటగాడిగానే అతడు బెస్ట్. ఎందుకంటే ఆల్‌రౌండర్లలో అతడికి తిరుగులేదు' అని రవిశాస్త్రి అన్నాడు.
'అందుకే జడ్డూనే అతడి ఆటపై దృష్టిపెట్టనివ్వండి. అతడికి కెప్టెన్సీ ఇవ్వడం వల్ల సీఎస్‌కే కొన్ని మ్యాచుల్లో ఓడిపోయింది. సీఎస్‌కే ఇప్పుడున్న ఫామ్ చూడండి. ముందు నుంచీ ఇలాగే ఉంటూ ప్లేఆఫ్ రేసులో ఉండేవాళ్లు. ఫిట్‌గా ఉంటే ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్లో జట్టును నడిపించొచ్చు. కానీ తర్వాతి నాయకుడి కోసం సీఎస్‌కే కాస్త టైమ్ తీసుకుంటే మంచిది. తమ జట్టు సభ్యుడినే కాకుండా బయట నుంచి తీసుకున్నా ఫర్వాలేదు. రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో కొన్ని మ్యాచుల్లో నాయకత్వం వహించాడు. పరుగులు చేసినంత మాత్రాన కెప్టెన్‌గా సరిపోతాడని చెప్పలేం. అతడిపై ఆ భారం మోపకపోవడమే మంచిది' అని శాస్త్రి వెల్లడించాడు.