ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 52 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 17.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోల్‌కతాకు విజయంతో పాటు మంచి నెట్ రన్‌రేట్ కూడా లభించింది.
అదరగొట్టిన వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కళ్లు చెదిరే ఆరంభం లభింది. ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (43: 24 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మొదటి బంతి నుంచే చెలరేగి ఆడాడు. తనకు అజింక్య రహానే (25: 24 బంతుల్లో, మూడు ఫోర్లు) నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ మొదటి వికెట్‌కు 5.4 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. అయితే వెంకటేష్ అయ్యర్‌ను అవుట్ చేసి కుమార్ కార్తికేయ కోల్‌కతాకు మొదటి వికెట్ అందించాడు. ఆ తర్వాత కాసేపటికే అజింక్య రహానే కూడా కార్తికేయ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డయ్యాడు.
అక్కడ్నుంచి కోల్‌కతాకు కష్టాలు మొదలయ్యాయి. రెండో స్పెల్‌లో జస్‌ప్రీత్ బుమ్రా చెలరేగిపోయాడు. ఒకే ఓవర్లో వేగంగా ఆడుతున్న నితీష్ రాణా (43: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌లను (9: 5 బంతుల్లో, ఒక సిక్సర్) అవుట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో కూడా షెల్డన్ జాక్సన్ (5: 7 బంతుల్లో), ప్యాట్ కమిన్స్ (0: 2 బంతుల్లో), సునీల్ నరైన్‌లను (0: 1 బంతి) అవుట్ చేయడంతో బుమ్రా ఐదు వికెట్ల మార్కును కూడా అందుకున్నాడు.
చివర్లో రింకూ సింగ్ (23 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడినా తనకు మరో ఎండ్ నుంచి సహకారం లభించలేదు. దీంతో ఒక దశలో 200 స్కోరును సులభంగా అందుకుంటుంది అనుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులకు పరిమితం అయింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఇది ఐదో స్థానంలో నిలిచింది. కుమార్ కార్తికేయకు రెండు వికెట్లు దక్కగా... డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్‌లు చెరో వికెట్ తీశారు.
ఇషాన్ కిషన్ మినహా..
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (2: 5 బంతుల్లో) మొదటి ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత ఇషాన్ కిషన్ (51: 43 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) చెలరేగి ఆడాడు. కానీ తనకు మరో ఎండ్‌లో సహకారం లభించలేదు. ఇషాన్ కిషన్ తర్వాత అత్యధిక స్కోరు కీరన్ పొలార్డ్‌ది (15: 16 బంతుల్లో, ఒక సిక్సర్) అంటేనే అర్థం చేసుకోవచ్చు ముంబై ఇన్నింగ్స్ ఎంత పేలవంగా సాగిందో.
చివర్లో కీరన్ పొలార్డ్ సహా... మూడు వికెట్లను ముంబై రనౌట్ ద్వారానే కోల్పోయింది. దీంతో 17.3 ఓవర్లలో 113 పరుగులకు ఆలౌట్ అయింది. కోల్‌కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ మూడు వికెట్లు తీయగా... ఆండ్రీ రసెల్‌కు రెండు వికెట్లు, టిమ్ సౌతీ, సునీల్ నరైన్‌లకు చెరో వికెట్ దక్కాయి.