LSG vs GT Preview: ఐపీఎల్ 2022లో 57వ మ్యాచులో లక్నో సూపర్‌జెయింట్స్ (Lucknow Supergiants), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) తలపడుతున్నాయి. పుణె మైదానం ఇందుకు వేదిక. ఇవి రెండూ కొత్త జట్లే! సమానంగా మ్యాచులాడాయి. సమానంగా గెలిచాయి. మరి వీరిలో ఎవరు ఎవరిని ఓడించి ముందుగా ప్లేఆఫ్స్ చేరుకుంటారు? తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి?
కొత్తగా వచ్చినా అదుర్స్
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు వచ్చినప్పుడు వారి ప్రదర్శన ఎలా ఉంటుందోనని అంతా అనుకున్నారు. గుజరాత్ టైటాన్స్ మిడిలార్డర్‌ను చూసి పెదవి విరిచారు. కానీ విమర్శలను లెక్క చేయని గుజరాత్ చక్కని విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ప్రపంచ స్థాయి ఆల్‌రౌండర్లతో జట్టును నింపేసిన రాహుల్ సేనపై మొదట్నుంచి అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకుంటూ ఇప్పుడు టేబుల్ టాపర్‌గా మారింది. ఈ రెండు జట్లు 11 మ్యాచుల్లో 8 గెలిచి 3 ఓడి 16 పాయింట్లతో నిలిచాడు. బెటర్ రన్‌రేట్‌తో లక్నో అగ్రస్థానానికి వెళ్లిపోయింది. నేటి మ్యాచులో గెలిచిన వారు ప్లేఆఫ్స్‌కు అర్హత పొందిన తొలి జట్టుగా నిలుస్తారు.
LSG సూపర్ ఫామ్
లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ ఫామ్‌లో ఉంది. మొహిసిన్ ఖాన్ రాకతో వారి పేస్ అటాక్ మరింత బలపడింది. తొలిసారి తలపడ్డప్పుడు గుజరాత్ టైటాన్స్ వీరిపై విజయం అందుకుంది. అందుకే ఈ సారి ప్రతీకారం తీర్చుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది. ఓపెనింగ్‌లో కేఎల్ రాహుల్, డికాక్ సూపర్‌గా ఆడుతున్నారు. దీపక్ హుడా ఎప్పుడూ లేనంత ఫామ్‌లో కనిపిస్తున్నాడు. మార్కస్ స్టాయినిస్ కూల్‌గా సిక్సర్లు బాదేస్తున్నాడు. మిడిలార్డర్‌లో ఇంకాస్త మెరుపులు అవసరం. చమీరా, అవేశ్ ఖాన్, మొహిసిన్, హోల్డర్‌తో పేస్ విభాగం బలంగా ఉంది. అవసరమైతే స్టాయినిస్ ఉన్నాడు. కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్ స్పిన్‌తో వికెట్లు తీస్తున్నారు. ఓపెనర్లు మహ్మద్ షమి బౌలింగ్‌లో ఆచితూచి ఆడటం అవసరం.
GTకి మూమెంటమ్ కావాలి
మొదట్లో వరుస విజయాలతో దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్ తాజాగా హ్యాట్రిక్ ఓటములతో ఇబ్బంది పడుతోంది. వృద్ధిమాన్ సాహా దూకుడుగా కనిపిస్తున్నాడు. శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్య ఫామ్‌లోకి రావాలి. మూడో నంబర్‌లో స్థిరమైన ఆటగాడు దొరకడం లేదు. డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ మిడిలార్డర్‌లో గుజరాత్‌కు ప్రాణంగా మారారు. వీరిని ఇబ్బంది పెడితే టైటాన్స్ పని పట్టినట్టే! ముంబయి ఇదే చేసింది. బౌలింగ్‌లో మాత్రం టైటాన్స్‌కు తిరుగులేదు. వికెట్లు తీస్తున్నా లాకీ ఫెర్గూసన్ ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు. షమి, అల్జారీ జోసెఫ్ ఫర్వాలేదు. రషీద్ ఖాన్‌కు మరో స్పిన్నర్ సహకారం అవసరం.
LSG vs GT Probable XI
లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, మార్కస్ స్టాయినిస్, కృనాల్ పాండ్య, ఆయుష్ బదోనీ, జేసన్ హోల్డర్, అవేశ్ ఖాన్ / కృష్ణప్ప గౌతమ్, మొహిసన్ ఖాన్, దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, ప్రదీప్ సంగ్వాన్