IPL 2022 IPL playoffs to be held in Kolkata and Ahmedabad with full capacity crowds : క్రికెట్‌ అభిమానులకు మరో శుభవార్త! ఐపీఎల్‌ 2022 ప్లేఆఫ్‌ మ్యాచుల వేదికలు ఖరారయ్యాయి. కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో తలో రెండు మ్యాచులు నిర్వహించనున్నారు. పూర్తి సామర్థ్యం మేరకు అభిమానులకు అనుమతి ఇస్తుండటం మరో విశేషం.


ఐపీఎల్‌ 2022 లీగు మ్యాచులన్నీ మహారాష్ట్రలో జరుగుతున్నాయి. ముంబయిలోని వాంఖడే, బ్రబౌర్న్‌, డీవై పాటిల్‌, పుణెలోని ఎంఎసీఏ స్టేడియంలో మ్యాచులు నిర్వహిస్తున్నారు. మ్యాచుల పూర్తి షెడ్యూలు ఇచ్చినప్పటికీ ప్లేఆఫ్స్‌ వేదికలను గతంలో ప్రకటించలేదు. బహుశా మొతేరాలో ఉంటాయని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఇప్పుడు రెండు వేదికలు ప్రకటించడం గమనార్హం.


కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో మే 24న క్వాలిఫయర్‌ 1 ఆ తర్వాత రోజు ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఒక రోజు విరామం తర్వాత అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియానికి వేదిక మారనుంది. మే 27న క్వాలిఫయర్‌ 2, మే 29న ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు.


ఈ ప్లేఆఫ్స్‌ మ్యాచులకు 100 శాతం అభిమానులకు అనుమతిస్తామని బీసీసీఐ తెలిపింది. పూర్తి సామర్థ్యం మేరకు ఫ్యాన్స్‌కు అనుమతిస్తుండటం రెండేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. గత రెండు సీజన్లు ఖాళీ స్టేడియంలో లేదా పాక్షిక సభ్యుల ముందే జరిగాయి.


ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచులకు 50 శాతం వరకు ఫ్యాన్స్‌ను అనుమతిస్తున్నారు. వాస్తవంగా మొదట్లో 25 శాతమే టికెట్లు ఇచ్చారు. కొవిడ్‌ ప్రభావం తక్కువ కావడం, దేశవ్యాప్తంగా టీకాలు వేయించుకోవడం, వ్యాధి సోకినా మరీ ప్రమాదకరంగా లేకపోవడంతో సామర్థ్యాన్ని పెంచారు.


కోల్‌కతా, అహ్మదాబాద్‌ను ప్లేఆఫ్స్‌ వేదికలుగా ఎంపిక చేయడానికి ఓ కారణం ఉన్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్‌ ముందర వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీసులను ఇక్కడే నిర్వహించారు. వన్డేలను అహ్మదాబాద్‌లో ఖాళీ స్టేడియంలో ఆడించారు. టీ20లను ఈడెన్‌లో 75 శాతం క్రౌడ్‌ మధ్య నిర్వహించారు.


'ఐపీఎల్‌ పురుషుల నాకౌట్‌ మ్యాచులకు సంబంధించి కోల్‌కతా, అహ్మదాబాద్‌ను వేదికలుగా నిర్ణయించాం. 100 శాతం అభిమానులకు అనుమతిస్తున్నాం. మే22న లీగ్‌ స్టేజ్‌ పూర్తవ్వగానే ఈ మ్యాచులు మొదలవుతాయి' అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నారు. ఇక మే 24 నుంచి 28 వరకు మూడు జట్లతో మహిళల ఛాలెంజర్స్‌ ట్రోఫీ ఉంటుందని వెల్లడించారు. లక్నోను వేదికగా ఎంపిక చేశామన్నారు.