Hardik Pandya Fitness Test: టీమ్‌ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ఎట్టకేలకు ఫిట్‌నెస్ టెస్టుకు రెడీ అయ్యాడు! ఇంతకు ముందే చాలాసార్లు పిలిచినప్పటికీ అతడు వెళ్లలేదు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్ ఆడాలంటే మొదట ఫిట్‌నెస్ టెస్టులో (Fitness Test) పాసవ్వాలి. అయితే ఈ సారి టెస్టు అతడికి మామూలుగా ఉండదని అంటున్నారు.
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ పాండ్యను జట్టులోకి తీసుకోలేదు. గాయాల పాలవ్వడంతో అతడికి విశ్రాంతినిచ్చారు. బౌలింగ్ చేయకపోవడంతో అతడిని సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. చాన్నాళ్ల తర్వాత అతడు బెంగళూరులోని ఎన్‌సీఏకు టెస్టు కోసం వచ్చాడు. అయితే ఈసారి టెస్టు అతడికి సవాలేనని తెలుస్తోంది. యోయో టెస్టుతో పాటు కనీసం పది ఓవర్లో బౌలింగ్ టెస్టు పెట్టబోతున్నారు.
'ఎన్‌సీఏ ఫిజియోలు, వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఈ ఫిట్‌నెస్ టెస్టు ప్రోగ్రామ్‌ను నిర్ణయిస్తున్నారు. కానీ సెలక్టర్లు మాత్రం అతడు కచ్చితంగా పది ఓవర్లు బౌలింగ్ చేయాలని, యోయో టెస్టు పాసవ్వాలని నిర్దేశించారు. ఇది అతడి కోసమే నిర్దేశించింది కాదు. క్రికెటర్లందరికీ ఇదే టెస్టు ఉంటుంది. సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు ఐపీఎల్ ముందు ఈ టెస్టు తప్పనిసరి' అని బీసీసీఐ అధికారి ఒకరు అంటున్నారు.
యోయో ఫిట్‌నెస్ టెస్టును హార్దిక్ పాండ్య సులువుగానే పాసవుతుంటాడు. కనీస స్కోరు 16.5తో పోలిస్తే 18 వరకు సగటు స్కోరు తెచ్చుకుంటాడు. అయితే అతడు బౌలింగ్ టెస్టు పాసవ్వాల్సి ఉంటుంది. 'గుజరాత్ ఒకవేళ పూర్తి స్థాయి బ్యాటర్, కెప్టెన్, ఫినిషర్ కావాలనుకుటే హార్దిక్ రెడీగా ఉన్నాడు. అతడి బౌలింగ్‌పై ఎన్‌సీఏ ఫిజియోలు, స్పోర్స్ట్ సైన్స్, మెడిసిన్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. అతడు బౌలింగ్ రెడీగానే ఉన్నాడేమో' అని మరొకరు అన్నారు.
గుజరాత్ టైటాన్స్ నిర్వహించిన క్యాంపులో హార్దిక్ 135 కి.మీ వేగంతో బౌలింగ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తన బౌలింగ్ విషయంలో 'సర్‌ప్రైజ్' ఉంటుందని పాండ్య అనడం గమనార్హం.