IPL 2022 MS Dhoni Defending CSK struck by 3 major problems: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సీజన్‌ ఇంకా మొదలవ్వనేలేదు! డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Super Kings) మూడు పెద్ద సమస్యలను ఎదుర్కొంటోంది. ఆ జట్టు ఆటగాళ్లు గాయపడటమే కాకుండా కొందరు అందుబాటులో ఉండటం లేదు. క్రికెటర్ల కొరత ఆ జట్టును వేధిస్తోంది!


ఐపీఎల్‌ 15వ సీజన్లో (IPL 15) మొదటి మ్యాచు మార్చి 26న జరుగుతోంది. ఈ మ్యాచులో తలపడేది చెన్నై సూపర్ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (CSK vs KKR). పది జట్లతో జరిగే సీజన్లో ఎక్కువ విజయాలు సాధిస్తేనే ప్లేఆఫ్‌కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. అందుకే మొదటి మ్యాచ్‌ గెలిచి అదే జోరు ప్రదర్శించాలని అన్ని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. మరి కీలక ఆటగాళ్లు ఉంటేనే విజయాలు సులభంగా దక్కుతాయి.


చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రధాన పేసర్‌ దీపక్‌ చాహర్‌ (Deepak Chahar). కొన్నేళ్లుగా అతనా జట్టుకు కీలకంగా మారిపోయాడు. ఎంఎస్‌ ధోనీ (MS Dhoni) సారథ్యంలో తన నైపుణ్యాలకు  పదును పెట్టుకున్నాడు. అనుకూలమైన పరిస్థితులు ఉంటే ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడతాడు. ముంబయిలోనూ చెన్నై తరహా పరిస్థితులే ఉంటాయి. సముద్రం ఉంటుంది. దాంతో గాల్లో ఎక్కువ హ్యుమిడిటీ ఉంటుంది. డ్యూ వస్తుంటుంది. ఇలాంటప్పుడు దీపక్‌ చాహర్‌ బంతిని రెండువైపులా స్వింగ్‌ చేసి వికెట్లు తీస్తుంటాడు. గాయం కారణంగా దీపక్‌ చాహర్‌ దాదాపుగా 7-10 మ్యాచులకు అందుబాటులో ఉండకపోవడం సీఎస్‌కే ఎదుర్కొంటున్న మొదటి సమస్య.


తన బేస్‌, కోర్‌ గ్రూపును సీఎస్‌కే నిర్మించుకుంటోంది. పదేళ్ల పాటు సేవలందించే కుర్రాళ్లకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో ఓపెనర్‌ రుతురాజ్ గైక్వాడ్‌  (Ruturaj Gaikwad)మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది. నిజానికి అతడు అద్భుతమైన క్రికెటర్‌. ఆధునిక షాట్లతో సంబంధం లేకుండా సంప్రదాయ క్రికెటింగ్‌ షాట్లతోనే పరుగులు చేస్తాడు. మొదట్లో కాస్త కుదురుకుగా ఆడి ఆపైన భీకరమైన వేగంతో పరుగులు చేస్తుంటాడు. ఇండియాకు ఆడుతుండగానే రుతురాజ్‌ గాయపడ్డాడు. అతడూ 7 మ్యాచులకు అందుబాటులో ఉండడని అంటున్నారు. ఇది రెండో సమస్య.


తాజాగా ఎదురైన మూడో సమస్య ఏంటంటే? దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డ్వేన్‌ ప్రిటోరియస్‌ ఎన్ని మ్యాచులు ఆడతాడో తెలియడం లేదు. సీఎస్‌కే కూర్పు కుదరాలంటే పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు అవసరం. బంగ్లాదేశ్‌తో వన్డే సిరీసుకు ప్రిటోరియస్‌ను దక్షిణాఫ్రికా ఎంపిక చేసింది. ఆ సిరీస్‌ ఆడితే ఐపీఎల్‌ తొలి మ్యాచుకు అతడు అందుబాటులో ఉండడు. ఎందుకంటే మార్చి 23న వన్డే సిరీస్‌ ముగుస్తుంది. ఎవరైనా జట్టులో చేరాలంటే మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. ఇక అతడిని టెస్టు సిరీస్‌కు ఎంపిక చేస్తే నాలుగైదు మ్యాచులకు రాలేడు. మరీ సమస్యలను సీఎస్‌కే, ధోనీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.