Major changes to IPL playing conditions: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో (IPL) కొన్ని నిబంధనలు మారుతున్నాయి. సీజన్‌ ఆరంభానికి ముందు కొన్ని కొత్త రూల్స్‌ తీసుకొస్తున్నారు. ఇకపై మ్యాచుకు ముందు ఆటగాళ్లు కొవిడ్‌ బారిన పడితే ఏం చేయాలో స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే డీఆర్‌ఎస్‌ల (DRS) సంఖ్యను  పెంచారు.


మరికొద్ది రోజుల్లో ఐపీఎల్‌ 15 సీజన్ మొదలవుతోంది. మార్చి 26న చెన్నై సూపర్‌కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ తొలి మ్యాచులో తలపడబోతున్నాయి. ఏటా సీజన్ ఆరంభానికి ముందు అవసరమైతే నిబంధనలను మారుస్తుంటారు. ఈ సారీ అలాగే చేయబోతున్నారు. ఎంసీసీ సవరించిన ఒక రూల్‌ను ఇప్పటి నుంచే అమలు చేయబోతున్నారు.


రెండు DRSలు


'ప్రతి ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్‌ల సంఖ్యను ఒకటి నుంచి రెండుకు పెంచుతున్నారు. అంటే ప్రతి జట్టు ఒక ఇన్నింగ్స్‌లో రెండు సమీక్షలు కోరవచ్చు. ఎవరైనా క్యాచ్‌ఔట్‌ అయితే బ్యాటర్‌ క్రీజులోంచి కదిలినా, కదలకపోయినా కొత్త బ్యాటరే స్ట్రైకింగ్‌ తీసుకుంటాడు. ఔటైన బంతి ఓవర్లో ఆఖరి కాకపోతే మాత్రం అలా ఉండదు' అని ఫ్రాంచైజీలకు బీసీసీఐ వివరించినట్టు తెలుస్తోంది.


Super over కుదరకపోతే


సూపర్‌ ఓవర్‌ (Super Over) విషయంలోనూ ఒక నిబంధన మారుతోంది. గతంలో మ్యాచ్‌ టై అయితే ఫలితం వచ్చేంత వరకు సూపర్‌ ఓవర్లు ఆడించేవారు. ఇప్పుడలా కాదు. మ్యాచ్‌ ముగిసిన నిర్దేశిత సమయం ఉంటేనే సూపర్‌ ఓవర్‌ ఆడిస్తారు. ఒక వేళ ఫలితం తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ కుదరకపోతే లీగు దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన వారికే  విజయం దక్కుతుంది. ఫైనల్‌ మ్యాచుకూ ఇదే రూల్‌ వర్తిస్తుంది.


'విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ లేదా వరుస సూపర్‌ ఓవర్లు నిర్వహించే సమయం లేకపోతే లీగు దశలో ఎక్కువ పాయింట్లు పొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో ఉన్నవారే ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తారు' అని బీసీసీఐ తెలిపింది.


కరోనా సోకితే


కరోనా (Covid 19) వల్ల ఒకవేళ తుది పదకొండు మందిని మైదానంలోకి దించలేకపోతే ఏం చేయాలో టెక్నికల్‌ కమిటీకి వదిలేస్తున్నారు. కరోనా వల్ల ఏడుగురు భారతీయులు, నలుగురు విదేశీయులతో కూడిన జట్టును దించేందుకు అవకాశం లేకపోతే రీషెడ్యూలు చేస్తారు. ఒకవేళ రీషెడ్యూలు చేసేందుకు వీలవ్వకపోతే ఆ అంశాన్ని ఐపీఎల్‌ టెక్నికల్‌ కమిటీకి రిఫర్‌ చేస్తారు. వారు తీసుకున్నదే తుది నిర్ణయం. అంతా దానిని గౌరవించాల్సిందే.


ప్లేఆఫ్‌ మ్యాచుల వేదికలను మార్చే పూర్తి అధికారం బీసీసీఐకే ఉంటుంది. దాంతోపాటు సెంట్రల్‌ రెవెన్యూ తీసుకునే హక్కులు ఉంటాయి.