IPL 2022, Delhi Capitals Swot Analysis: 'యే హై నయీ దిల్లీ' అని ఏ ముహూర్తంలో అన్నారో తెలియదు గానీ ఐపీఎల్‌లో దిల్లీ ఫ్రాంచైజీ (Delhi Capitals) కథే మారిపోయింది! నాలుగేళ్ల క్రితం వరకు వరుసగా ప్లాఫ్‌ షోలు! మెరిసే కుర్రాళ్లున్నా పెర్ఫామెన్స్‌ మాత్రం అంతంతే! అలాంటి జట్టు ఇప్పుడు ది బెస్ట్‌గా మారిపోయింది. ప్రతి సీజన్లోనూ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొడుతోంది. మరి మెగా వేలం తర్వాత దిల్లీ క్యాపిటల్స్‌ ఎలాగుంది? తుది జట్టు ఎలా ఉండబోతోంది? సరైన ఆటగాళ్లను రిప్లేస్‌ చేసుకుందా? ఫ్లేఆఫ్ చేరుతుందా?


నిజమైన డేర్‌డెవిల్స్‌


మొదట్లో ఈ ఫ్రాంచైజీ పేరు 'దిల్లీ డేర్‌ డెవిల్స్‌'! పేరులో ఉన్నంత డేరింగ్‌ జట్టులో ఉండేది కాదు! 2019లో యాజమాన్యం 'దిల్లీ క్యాపిటల్స్‌' అని పేరు మార్చింది. కోచింగ్‌ స్టాఫ్‌ను మార్చింది. ఆటగాళ్లను మార్చింది. అంతే పాత పేరులోని డేర్ డెవిల్స్‌నెస్‌ కొత్త జట్టులో కనిపించడం మొదలైంది. ఒకప్పుడు కేవలం కుర్రాళ్లనే నమ్ముకున్న ఆ జట్టు 2019 నుంచి సీనియర్లు, జూనియర్ల మేళవింపుతో మెరుగ్గా మారింది. రికీ పాంటింగ్ (Rikcy Ponting) కోచ్‌, సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) మెంటార్‌గా రావడంతో ఒక్కసారిగా క్రికెటర్ల దృక్పథం మారిపోయింది. ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. ఆ తర్వాత దాదా బీసీసీఐకి వచ్చేసినా పాంటింగ్‌ బాగానే నడిపిస్తున్నాడు. కెప్టెన్‌ రిషభ్ పంత్ (Rishabh Pant) సైతం కెప్టెన్సీతో అలరిస్తున్నాడు.


IPL Auction 2022 స్ట్రాటజీ బాగుంది


సాధారణంగా కస్టమర్‌ మెంటాలిటీ ఎలా ఉంటుంది? తక్కువ ధర లేదా సరైన ధరకు నాణ్యమైన ఉత్పత్తులను ఖరీదు చేయాలని అనుకుంటాడు. ఐపీఎల్‌ 2019 మెగా వేలంలో దిల్లీ అలాగే ప్రవర్తించింది. అసలు ఎవరూ ఊహించని రీతిలో చక్కని ఆటగాళ్లను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ను రూ.6 కోట్లకే తీసుకుంది. రోమన్‌ పావెల్‌, మిచెల్‌ మార్ష్‌ను (Mitchel Marsh) తీసుకుంది. బౌలింగ్‌ డెప్త్‌ను మరింత పెంచుకుంది. శార్దూల్ ఠాకూర్‌ (Shardhul Thakur), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌, లుంగి ఎంగిడి, ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా, కమలేశ్‌ నాగర్‌ కోటి, కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకుంది. అయితే ఆన్రిచ్‌ నార్జ్‌తో పాటు మరో బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ పేసర్‌ ఉంటే బాగుండేది.


Delhi Capitals Probable XI


దిల్లీ క్యాపిటల్స్‌ తుది జట్టు బాగానే అనిపిస్తోంది. డేవిడ్‌ వార్నర్‌ రావడంతో శిఖర్‌ ధావన్‌ లోటు ఉండదు. పృథ్వీ షాతో కలిసి అతడు ఓపెనింగ్‌ చేస్తాడు. మార్కస్‌ స్టాయినిస్‌ లేడు కాబట్టి మిచెల్‌ మార్ష్‌ను తీసుకున్నారు. అతడు బ్యాటింగ్‌, బౌలింగ్ చేస్తాడు. వన్‌డౌన్‌లో వస్తాడు. రిషభ్‌ పంత్‌ నాలుగులో వస్తాడు. ఐదులో మన్‌దీప్‌ సింగ్‌, శ్రీకర్ భరత్‌ లేదా సర్ఫరాజ్‌ ఖాన్‌కు ఛాన్స్‌ ఉంటుంది. ఆ తర్వాత రోమన్‌ పావెల్‌, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, ఆన్రిచ్‌ నార్జ్‌, చేతన్‌ సకారియా ఉంటారు. దేశవాళీ ఆల్‌రౌండర్లు ఉండటం వీరి ప్లస్‌ పాయింట్‌. అక్షర్‌, శార్దూల్‌ ఏం చేయగలరో మనకు తెలుసు. దిల్లీ బ్యాకప్‌ ప్లేయర్స్‌ కూడా స్ట్రాంగే! నార్జ్‌ గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. రిప్లేస్‌మెంట్లు ఉన్నా వారెలా రాణిస్తారో చూడాలి. భవిష్యత్తు కోసం కుర్రాళ్లనూ కొనుక్కొంది.


ఈసారి కప్‌ గెలవండి!


ఐపీఎల్‌ 2022లో దిల్లీ క్యాపిటల్స్‌ ప్లేఆఫ్‌ చేరుకోవడం ఖాయమే! ఆ జట్టుకు ఉన్న రిసోర్సెస్‌ అలాంటివి. కాంబినేషన్‌ ఒక్కసారి సెట్‌ అయ్యిందంటే ఆ జట్టును ఆపడం కష్టం. అయితే ప్రతిసారీ లీగ్‌ దశలో అదరగొడుతున్న ఆ జట్టు తప్పక గెలవాల్సిన, పెద్ద మ్యాచుల్లో ఒత్తిడికి గురవుతోంది. ముఖ్యంగా ప్లేఆఫ్స్‌, ఫైనళ్లలో ఓడిపోతోంది. గత రెండేళ్లలో ఇదే కనిపించింది. అందుకే ఆ వీక్‌నెస్‌ నుంచి దిల్లీ బయటకు రావాలి. ఫైనళ్లు గెలవగలమన్న నమ్మకం పెంచుకోవాలి. ప్రతిసారీ మనసులు గెలిచే ఆ జట్టు ఇకనైనా కప్పు గెలిస్తే చూడాలన్నది అభిమానుల ఆకాంక్ష!!


Also Read: హిట్‌మ్యాన్‌ ఉండగా భయమేల! కానీ పాండ్య బ్రదర్స్‌ ఫినిషర్స్‌ లోటు తీర్చేదెవరు MI?


Also Read: వీక్‌నెస్‌ లేని ఏకైక జట్టు - పేపర్‌ పైన ది బెస్ట్‌! LSG ప్లేఆఫ్‌ గ్యారంటీనే!