England cricketers pull out IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడాలని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది క్రికెటర్లు ఎదురు చూస్తుంటారు. తమను తాము ప్రూవ్ చేసుకొనేందుకు ఒక్క ఛాన్స్ వస్తే బాగుండని అనుకుంటారు. ఆసీస్ క్రికెటర్లైతే ఇక్కడి స్టేడియాలను రెండో హోమ్‌గ్రౌండ్‌గా భావిస్తారు. అలాంటిది ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏమైందో తెలియడం లేదు. వేలంలో ఎంపికైన తర్వాత హఠాత్తుగా తప్పుకుంటున్నారు. ఫ్రాంచైజీలను ఇబ్బంది పెడుతున్నారు.
ఏటా ఇంగ్లాండ్ ప్లేయర్ల నుంచి ఎదురవుతున్న ఈ ప్రవర్తనతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు విసిగిపోయాయి. వేలంలో అందుబాటులో ఉంటారు. మొత్తం సీజన్ ఆడతామన్నట్టు బిల్డప్ ఇస్తారు. సీజన్ ఆరంభానికి ముందు లీగ్ నుంచి తప్పుకుంటామని ప్రకటిస్తారు. కొందరు గాయాలతో నిజాయతీగా తప్పుకుంటారు. మరికొందరు మాత్రం బుడగ ఒత్తిడి భరించలేమంటూ వెళ్లిపోతారు. ముందు మాత్రం బుడగ ఒత్తిడి తెలియనట్టు వేలంలో పేర్లు నమోదు చేసుకుంటారు.
తాజాగా సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసిన అలెక్స్ హేల్స్ (Alex Hales), గుజరాత్ టైటాన్స్ తీసుకున్న జేసన్ రాయ్ (Jason Roy) లీగు నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. బయో బబుల్ ఫాటిగ్ (Bio Bubble) తట్టుకోలేక పోతున్నామని వివరించారు. దాంతో ఆ ఫ్రాంచైజీలు మళ్లీ వేరేవాళ్లతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మార్క్‌వుడ్ (Mark Wood) తప్పుకొనే ఉద్దేశంతో కనిపిస్తున్నాడు. రెండు రోజులు క్రితం మ్యాచ్ ఆడుతూ అతడు గాయపడ్డాడు. విపరీతమైన నొప్పితో మ్యాచు నుంచి తప్పుకున్నాడు. బహుశా అతడు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండకపోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. గతేడాది జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్, లియామ్ లివింగ్‌స్టన్ సీజన్ మొదలయ్యాక తప్పుకున్నారు. మార్కవుడ్ వేలం నుంచి తప్పుకున్నాడు.
'ఇది దురదృష్టకరం. క్రీడాస్ఫూర్తికి విరుద్ధమే చెప్పాలి. ఎవరైనా అందుబాటులో ఉంటామని చెప్పినప్పుడు వాళ్లే ఆధారంగా ఫ్రాంచైజీలు కొన్ని ప్రణాళికలు రూపొందించుకుంటాయి. ఎమర్జెన్సీ అయితే, గాయపడితే మేం అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడలా అనిపించడం లేదు. భవిష్యత్తులో ఇంగ్లాండ్ క్రికెటర్లను ఎంపిక చేసుకొనేటప్పుడు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటారు' అని ఓ ఫ్రాంచైజీ అధికారి అంటున్నారు.