రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Bangalore) తన కొత్త నాయకుడిని ప్రకటించింది. విరాట్‌ కోహ్లీ (Virat Kohli) వారసుడు ఎవరో వెల్లడించింది. దక్షిణాఫ్రికా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మాజీ ఆటగాడు ఫాఫ్‌ డప్లెసిస్‌ను (Faf Du Plessis) కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఐపీఎల్‌ 15వ సీజన్లో (IPL 2022) ఈ సఫారీ సీనియర్‌ ప్లేయర్‌ తమ జట్టును నడిపిస్తాడని ట్వీట్‌ చేసింది.


గతేడాది ఐపీఎల్‌ రెండో దశకు ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నానని విరాట్‌ కోహ్లీ ప్రకటించాడు. దాంతో కొత్త కెప్టెన్‌ ఎవరవుతారోనన్న ఆసక్తి నెలకొంది. బిగ్‌బాష్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను నడిపిస్తున్న మాక్స్‌వెల్‌కు బాధ్యతలు అప్పగిస్తారని అంచనా వేశారు. చివరికి అంతర్జాతీయ క్రికెట్లో లీడర్‌షిప్‌ అనుభవం ఉన్న డుప్లెసిస్‌కే పగ్గాలు అప్పగించింది. శనివారం ఏర్పాటు చేసిన 'ఆర్‌సీబీ అన్‌బాక్స్‌' ప్రోగ్రామ్‌లో కెప్టెన్‌ను ప్రకటించింది.


ఆర్‌సీబీ నాయకత్వ బృందం ఈ సారి బలంగానే కనిపిస్తోంది. డుప్లెసిస్, విరాట్‌ కోహ్లీ, మాక్స్‌వెల్‌, దినేశ్‌ కార్తీక్‌ లీడర్‌షిప్‌ గ్రూపులో ఉండనున్నారు. కాగా జట్టుకు డుప్లెసిస్‌ లీడర్‌షిప్‌ స్కిల్స్‌ ఎంతో అవసరమని ఆర్‌సీబీ హెచ్‌కోచ్‌ సంజయ్‌ బంగర్‌ అంటున్నాడు.







'డుప్లెసిస్‌ చేరికతో బ్యాటింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో అసలైన బలం పెరిగింది. అతనిప్పటికే నిరూపించుకున్నాడు. ప్రతి సీజన్లో రాణిస్తాడు. అత్యుత్తమ, అత్యున్నత స్థాయిల్లో క్రికెట్‌ ఆడాడు' అని సంజయ్‌ బంగర్‌ అన్నాడు. 'మా టాప్‌ ఆర్డర్‌ను మరింత దృఢంగా మార్చే క్రికెటర్ల కోసం చూస్తున్నాం. డుప్లెసిస్‌ చేరికతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. అతడు అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు ఆడాడు. అతడి ఓపెనింగ్‌ మాత్రమే కాకుండా నాయకత్వ లక్షణాలు ఆర్‌సీబీకి ఎంతో ముఖ్యం' అని బంగర్‌ వెల్లడించాడు.