రాజస్తాన్ రాయల్స్ తమ జట్టుకు శ్రీలంక మాజీ స్టార్ బౌలర్ లసిత్ మలింగను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. అలాగే దక్షిణాఫ్రికాకు చెందిన ప్యాడీ ఆప్టన్‌ను టీమ్ కెటలిస్ట్‌గా నియమించారు. మలింగ్ 2021లో ఐపీఎల్ నుంచి ఆటగాడిగా రిటైరయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మలింగనే. ముంబై ఇండియన్స్ తరఫున తొమ్మిది సీజన్లు ఆడిన మలింగ మొత్తంగా 170 వికెట్లు దక్కించుకున్నాడు.


2018లో మలింగ్ ముంబైకు బౌలింగ్ మెంటార్‌గా ఉండటంతో పాటు... ఈ సంవత్సరం ప్రారంభంలో శ్రీలంక జట్టుకు బౌలింగ్ స్ట్రాటజీ కోచ్‌గా కూడా నియమితుడయ్యాడు. శ్రీలంక జట్టులో మలింగతో పాటు సభ్యుడిగా ఉన్న కుమార సంగక్కర... రాజస్తాన్ రాయల్స్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. కౌంటీ క్రికెట్ అనుభవం ఉన్న స్టెఫాన్ జోన్స్‌ను హై పెర్ఫార్మెన్స్ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించారు.


ఐపీఎల్‌కు తిరిగి రావడం ఆనందంగా ఉందని, అలాగే రాజస్తాన్ రాయల్స్‌కు సేవలందించడం తనకు ఎంతో గౌరవప్రదం అని మలింగ అన్నాడు. రాజస్తాన్ రాయల్స్ ఎప్పుడూ యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తుందని, అది చాలా మంచి విషయం అని తెలిపారు.


2013 నుంచి 2015 వరకు, 2019లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్యాడీ ఆప్టన్ కోచ్‌గా వ్యవహరించాడు. టోర్నీలో మొదటి నాలుగు వారాలు మాత్రమే తను జట్టుతో ఉండనున్నాడు. మిగిలిన సీజన్ మొత్తం వర్చువల్‌గా జట్టును సపోర్ట్ చేయనున్నాడు.