Vijayawada Mayor: కొత్త సినిమా(Cinema) విడుదలైనప్పుడు ప్రతి షోకు 100 టికెట్లు పంపాలని విజయవాడ నగర మేయర్(Vijayawada Mayor) రాసిన లేఖ వివాదాస్పదం అయింది. ఈ లేఖపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న సినిమా థియేటర్లకు మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి లేఖ రాశారు. కొత్త సినిమా విడుదలైనప్పుడు మొదటి రోజు ప్రతి షోకు మల్టీప్లెక్స్‌ థియేటర్లు(Multiplex Theatres) 100 టికెట్లు పంపాలని మేయర్ థియేటర్లకు లేఖ రాశారు. పార్టీ కార్పొరేటర్లు, నాయకులు సినిమా టికెట్లు అడుగుతున్నారని వారి కోసం సినిమా టికెట్లను ఛాంబర్‌కు పంపాలని లేఖలో ఆమె కోరారు. టికెట్లకు అయ్యే డబ్బులు చెల్లిస్తామని లేఖలో ఆమె పేర్కొ్న్నారు. అయితే ఏకంగా నగర మేయర్ నుంచి టికెట్ల కోసం లేఖ రావటంతో థియేటర్ యజమానులు షాకయ్యారు. 



మేయర్ లేఖ దుమారం 


విజయవాడ(Vijayawada)లో నగర మేయర్ భాగ్యలక్ష్మి రాసిన లేఖ పెద్ద దుమారమే రేపుతోంది. మేయర్ తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మేయర్ హోదాలో సినిమా టికెట్ల కోసం లేఖ రాయడం ఏమిటని ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మేయర్ లేఖపై జనసేన మండిపడింది. జనసేన నేత పోతిన మహేశ్ విమర్శలు చేశారు. ఒక్కో షో(Show)కు వంద టిక్కెట్లు ఎందుకని ప్రశ్నించారు. అన్ని టికెట్లు మేయర్ ఏం చేసుకుంటారని మహేశ్ ప్రశ్నించారు. మేయర్ లేఖ వెనుక మంత్రి ఒత్తిడి ఉందని ఆరోపించారు. కొందరు వైసీపీ నేతలు బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. ఇటీవల భీమ్లా నాయక్ విషయంలో ఇది రుజువైందన్నారు. మంత్రి అనుచరులే ఈ టికెట్ల కోసం లేఖ రాయించి ఉంటారని ఆరోపించారు. ఒక్కో షోకి వంద టిక్కెట్లు(Tickets) తీసుకుని ఏం చేస్తారో మేయర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 


మేయర్ పై నెటిజన్లు ఫైర్ 


ప్రజలకు మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన మేయర్ సినిమా టికెట్ల కోసం లేఖలు రాయడమేంటని జనసేన నేతలు(Janasena Leaders) ప్రశ్నిస్తున్నారు. మేయర్‌ పదవిలో ఉండి సినిమా టికెట్ల కోసం థియేటర్లకు లేఖ రాయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశార. మేయర్‌ తీరుపై వైసీపీ(Ysrcp) అధినాయకత్వం కూడా సీరియస్ అయినట్లుగా సమాచారం. వైసీపీ హైకమాండ్ కూడా ఈ విషయంపై వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ లేని కొత్త సంప్రదాయానికి మేయర్ తెరలేపారని నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. మేయర్‌గా ఎంపికైంది ప్రజా సమస్యలను పరిష‌్కరించడానికి తప్ప, సినిమాలను ఫస్ట్ రోజే చూడటానికి కాదంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.