GT vs RCB, Match Highlights: గుజరాత్ టైటాన్స్‌కు ఎదురేలేదు. వారిని ఓడించే జట్టే కనిపించడం లేదు. ఐపీఎల్ 2022లో హార్దిక్ సేన మరో అద్భుత విజయం అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో ఛేదించారు. డేవిడ్ మిల్లర్ (39; 24 బంతుల్లో 4x4, 1x6), రాహుల్ తెవాతియా (43; 25 బంతుల్లో 5x4, 2x6) మ్యాచును అజేయంగా ఫినిష్ చేశారు. అంతకు ముందు బెంగళూరులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (58; 53 బంతుల్లో 6x4, 1x6), రజత్ పాటిదార్ (52; 32 బంతుల్లో 5x4, 2x6) అర్ధశతకాలు అందుకున్నారు. మాక్సీ (33; 18 బంతుల్లో 3x4, 2x6), మహిపాల్ లోమ్రర్ (16; 8 బంతుల్లో 2x4, 1x6) మెరిశారు.
ఎదురులేని తెవాతియా
ఛేజింగ్‌లో గుజరాత్‌కు మంచి స్టార్ వచ్చింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (29; 22 బంతుల్లో 4x4), శుభ్‌మన్ గిల్ (31; 28 బంతుల్లో ౩x4, 1x6) పవర్ ప్లేను చక్కగా ఉపయోగించుకున్నారు. తొలి వికెట్‌కు 51 పరుగుల భాగస్వామ్యం అందించారు. 7.3వ బంతికి సాహాను హసరంగ ఔట్ చేయడంతో సాయి సుదర్శన్ (20; 14 బంతుల్లో 2x4) వచ్చాడు. కాసేపు బాగానే ఆడాడు. అయితే 10 రన్స్ తేడాతో గిల్, హార్దిక్ పాండ్య (3) ఔటవ్వడంతో టైటాన్స్ ఇబ్బంది పడ్డారు. జట్టు స్కోరు 95 వద్ద సుదర్శన్‌ను హసరంగ పెవిలియన్‌కు పంపించడంతో ఆర్‌సీబీ వైపు మొగ్గింది. ఈ సిచ్యువేషన్‌లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా మళ్లీ నిలిచారు. ఐదో వికెట్‌కు 40 బంతుల్లో 79 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. దొరికిన ప్రతి బంతినీ వీరిద్దరూ బౌండరీకి పంపించారు. హేజిల్‌వుడ్ వేసిన 18వ ఓవర్లో 17 పరుగులు సాధించి గెలుపు సమీకరణం 12 బంతుల్లో 19గా మార్చారు. ఆ తర్వాత ఓవర్లనూ 12 రన్స్ రావడంతో గెలుపు ఖాయమైంది. మరో 3 బంతులు ఉండగానే టైటాన్స్ విజయం అందుకుంది.
14 మ్యాచుల తర్వాత కోహ్లీ 50
మధ్యాహ్నం మ్యాచ్ కావడం, టార్గెట్లను డిఫెండ్ చేస్తుండటంతో టాస్ గెలిచిన డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎప్పట్లాగే కోరుకున్న ఆరంభం మాత్రం వారికి దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్ద ప్రదీప్ సంగ్వాన్ బౌలింగ్‌లో డుప్లెసిస్ (0) డకౌట్ అయ్యాడు. గుజరాత్ చక్కగా బౌలింగ్ చేస్తుండటంతో విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ఆచితూచి ఆడారు. సింగిల్స్, డబుల్స్ తీసి చక్కని భాగస్వామ్యానికి పునాది వేశారు.
వికెట్‌పై నిలదొక్కుకోగానే పాటిదార్ బౌండరీలు, సిక్సర్లు బాదటం మొదలు పెట్టాడు. మరోవైపు విరాట్ రిస్క్ తీసుకోకుండా బౌండరీలు కొడుతూ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. మరికాసేపటికే పాటిదార్ హాఫ్ సెంచరీ అందుకొన్నాడు. 74 బంతుల్లో 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని పాటిదార్‌ను ఔట్ చేయడం ద్వారా సంగ్వాన్ విడదీశాడు. ఆ తర్వాత షమీ బౌలింగ్‌లో విరాట్ భారీ షాట్ ఆడబోయి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆఖర్లో మాక్సీ, మహిపాల్ లోమ్రర్ స్కోరును 170/6కు తీసుకెళ్లారు.