GT vs PBKS, 1 Innings Highlights: ఐపీఎల్ 2022లో 48వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ తడబడింది! పంజాబ్ కింగ్స్‌కు 144 పరుగుల మోస్తరు టార్గెట్ ఇచ్చింది. సాధారణంగా స్ట్రాంగ్ ఫినిషింగ్ ఇచ్చే టైటాన్స్ ఈ సారి మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయింది. కాగిసో రబాడా (4/33) వారి జోరుకు అడ్డుకట్ట వేశాడు. మిగతా బౌలర్లు సమష్టిగా రాణించారు. సాయి సుదర్శన్ (64*; 50 బంతుల్లో 5x4, 1x6) విలువైన హాఫ్ సెంచరీ చేశాడు. వృద్ధిమాన్ సాహా (21; 17 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించాడు.
టాస్ గెలిచిన హార్దిక్ పాండ్య మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బహుశా తమ బ్యాటింగ్ డెప్తును పరిశీలించాలన్నది అతడి ఫీలింగేమో! ఏదేమైనా టైటాన్స్‌కు మంచి ఓపెనింగ్ లభించలేదు. 17 వద్ద శుభ్‌మన్ గిల్ (9) రనౌట్ అయ్యాడు. 34 వద్ద వృద్ధిమాన్ సాహాను రబాడా పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత టైటాన్స్ కోలుకోలేదు. 44 వద్ద హార్దిక్ పాండ్య (1)ను రిషి ధావన్ ఔట్ చేశాడు. ఈ సీజన్లో గుజరాత్‌కు అండగా నిలిచిన మిల్లర్ (11)ను లివింగ్‌స్టోన్ అడ్డుకోవడంతో 67కే 4 వికెట్లు నష్టపోయి టైటాన్స్ కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో రాహుల్ తెవాతియా (11) అండతో సాయి సుదర్శన్ ఐదో వికెట్‌కు 30 బంతుల్లో 45 పరుగుల భాగస్వామ్యం అందించాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదాడు. అనవసర షాట్లకు పోలేదు. దాంతో 15.2 ఓవర్లకు టైటాన్స్ స్కోరు 100 దాటింది. తడబడుతున్న తెవాతియా షాట్లు కొట్టబోయి రబాడా వేసిన 16.2వ బంతికి ఔటయ్యాడు. ఆ తర్వాత బంతికే రషీద్ ఖాన్ (0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. సుదర్శన్ 42 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరోవైపు వికెట్లు పడుతున్నా స్ట్రాంగ్‌గా నిలబడ్డాడు. జట్టు స్కోరును 143/8కి చేర్చాడు. అర్షదీప్, లివింగ్‌స్టోన్, రిషి ధావన్ తలో వికెట్ పడగొట్టారు.