వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా నికోలస్‌ పూరన్‌ ఎంపికయ్యాడు. పురుషుల వన్డే, టీ20 జట్లకు ఇక నుంచి అతడే నాయకత్వం వహించనున్నాడు. కీరన్‌ పొలార్డ్‌ వారసుడిగా కొనసాగనున్నాడని క్రికెట్‌ వెస్టిండీస్‌ తెలిపింది. షై హోప్‌ వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు.


కీరన్‌ పొలార్డ్‌ సారథ్యంలో నికోలస్‌ పూరన్‌ అతడికి డిప్యూటీగా పనిచేశాడు. వైస్‌ కెప్టెన్‌గా సేవలు అందించాడు. 2021లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో కరీబియన్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. వెస్టిండీస్‌ క్రికెట్‌ జట్టుకు తనను నాయకుడిగా నియమించినందుకు పూరన్‌ కృతజ్ఞతలు తెలియజేశాడు. 


'విండీస్‌ టీమ్‌  కెప్టెన్‌గా ఎంపిక చేసినందుకు గౌరవంగా భావిస్తున్నా. విండీస్‌ను ఇప్పటికే ఎంతోమంది దిగ్గజాలు నడిపించారు. ఘనమైన వారసత్వం అందించారు. వారి అడుగు జాడల్లోనే నేను నడుస్తాను. క్రికెట్టే కరీబియన్లందరినీ ఏకం చేస్తోంది. అందుకే ఈ బాధ్యతను నేను అత్యంత ప్రెస్టీజియస్‌గా భావిస్తున్నా. కెప్టెన్‌గా గుర్తించడం నా కెరీర్లోనే ఒక గొప్ప మలుపు. మా జట్టుకు మద్దతు పలికే అభిమానుల ఆశలు నిలబెట్టేలా విండీస్‌ను ముందుకు తీసుకెళ్తా' అని పూరన్‌ అన్నాడు.






ఐపీఎల్‌ ఆడుతుండగానే విండీస్‌ టీ20, వన్డే జట్ల కెప్టెన్సీ నుంచి కీరన్‌ పొలార్డ్‌ తప్పుకున్న సంగతి తెలిసిందే. 'అత్యంత జాగ్రత్తగా చర్చించిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. అందరు కుర్రాళ్లలాగే నేనూ వెస్టిండీస్‌ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాలని పదేళ్ల వయసు నుంచే అనుకున్నా. 15 ఏళ్లుగా కరీబియన్‌ జట్టు తరఫున వన్డే, టీ20 క్రికెట్‌ ఆడినందుకు గర్వపడుతున్నా' అని పొలార్డ్‌ అన్నాడు.


'రాబోయే యువతరం కోసం నేను పక్కకు జరగాలని అనుకుంటున్నా. కుర్రాళ్లకు వెస్టిండీస్‌ క్రికెట్లో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. నా కెరీర్లో నాకెంతోగానో మద్దతు లభించింది. నా కల నెరవేరినందుకు నేనెంతో కృతజ్ఞతతో ఉన్నాను. వెస్టిండీస్‌ క్రికెట్‌కు నా బ్యాటుతో వందనం చేస్తున్నా' అని ఎమోషన్‌గా లెటర్‌ రాశాడు.