IPL 2022: Rinku Singh reveals he has been waiting for last five years to get a chance : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగులో అవకాశం కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నానని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు రింకూసింగ్‌ (Rinku singh) అంటున్నాడు. ఈ స్థాయిలో పోటీ విపరీతంగా ఉంటుందని పేర్కొన్నాడు. అలీగఢ్‌ నుంచి చాలామంది దేశవాళీ క్రికెట్‌ ఆడారన్నాడు. ఐపీఎల్‌ (IPL) తొలుత ఆడింది మాత్రం తానొక్కడినేనని వెల్లడించాడు.


ఐపీఎల్‌ 2022లో సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (KKR vs RR) తలపడ్డాయి. రాజస్థాన్‌ ఇచ్చిన 153 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో రింకూ సింగ్‌, నితీశ్ రాణా (48*) కీలక పాత్ర పోషించారు. రింకూ కేవలం 23 బంతుల్లోనే 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. మూమెంటమ్‌ను కేకేఆర్‌ వైపునకు మార్చి విజయం అందించినందుకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.


వాస్తవంగా ఈ మ్యాచుకు ముందే అజేయ అర్ధశతకం సాధించాలని రింకూసింగ్‌ అనుకున్నాడు. అందుకే మ్యాచ్‌ ఆరంభానికి ముందే రింకూ 50 నాటౌట్‌ అని చేతిలో రాసుకున్నాడు. 'అలీగఢ్‌ నుంచి చాలామంది ప్లేయర్లు రంజీ ఆడారు. ఐపీఎల్‌ ఆడిన మొదటి ఆటగాడిని మాత్రం నేనే. ఇది చాలా పెద్ద లీగ్‌. అంతకుమించి ఎంతో ఒత్తిడి ఉంటుంది. అవకాశం కోసం నేను ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నాను. నేనెంతో కష్టపడ్డాను. గాయం నుంచి కోలుకొని దేశవాళీ క్రికెట్లో రాణించాను' అని రింకూ అన్నాడు.


'నేను బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు నితీశ్‌ రాణా, మెక్‌ కలమ్‌ నాకు సలహాలు ఇచ్చారు. ఆఖరి వరకు ఉండి మ్యాచును ఫినిష్‌ చేయాలని సూచించారు' అని రింకూ పేర్కొన్నాడు.


RRపై KKR బ్యాటింగ్ ఎలా సాగిందంటే?


ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఊరట లభించింది. వరుసగా ఐదు ఓటముల తర్వాత సోమవారం రాత్రి రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శామ్సన్ (54: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం కోల్‌కతా 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. నితీష్ రాణా (48 నాటౌట్: 37 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... రింకూ సింగ్ (42: 23 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) చివర్లో వేగంగా ఆడాడు. 2018లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రింకూ సింగ్‌కు ఇప్పటి వరకు 13 మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఇన్నాళ్లు తను ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా తనకే దక్కింది.


చివర్లో ఆడేసుకున్న రింకూ...
మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కూడా ఇన్నింగ్స్‌ను పేలవంగానే ప్రారంభించింది. ఓపెనర్లు బాబా ఇంద్రజిత్ (15: 16 బంతుల్లో, రెండు ఫోర్లు), ఆరోన్ ఫించ్ (4: 7 బంతుల్లో) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. స్కోరు బోర్డుపై 32 పరుగులు చేరేసరికి ఓపెనర్లిద్దరూ పెవిలియన్ బాట పట్టారు.


అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (34: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), నితీష్ రాణా  కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. సాధించాల్సిన స్కోరు తక్కువే కావడంతో వీరిద్దరూ నిదానంగానే ఆడారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించిన అనంతరం ట్రెంట్ బౌల్డ్... శ్రేయస్ అయ్యర్‌ను అవుట్ చేశాడు. దీంతో నితీష్ రాణాకు రింకూ సింగ్ జతకలిశాడు.


ఒకవైపు నితీష్ రాణా వికెట్ పడకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తుంటే... మరోవైపు రింకూ వేగంగా ఆడాడు. విజయానికి 12 బంతుల్లో 18 పరుగులు కావాల్సిన దశలో ప్రసీద్ కృష్ణ వేసిన 19వ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్ మొదటి బంతికి సిక్సర్‌తో నితీష్ రాణా మ్యాచ్ ఫినిష్ చేశాడు.