ఐపీఎల్ 2022లో 40వ మ్యాచులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans), సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తలపడుతున్నాయి. వాంఖడే ఇందుకు వేదిక. రెండు జట్లు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నాయి. ఈ బౌలింగ్ జట్ల పోరాటంలో గెలిచేదెవరు? చివరి మ్యాచులో ఏమైంది? తుది జట్టులో ఎవరుంటారు?
దూకుడు మీదున్నాయ్!
సీజన్ ఆరంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌పై ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు! బ్యాటింగ్‌లో డెప్త్ లేదని భావించారు. అలాంటి జట్టే ఇప్పుడు 7లో 6 గెలిచి రికార్డు సృష్టించింది. 12 పాయింట్లు అందుకున్న మొదటి జట్టుగా నిలిచింది. ప్లేఆఫ్స్ రేసులో దూసుకుపోతోంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రెండు మ్యాచుల్లో ఓడి నిరాశపరిచింది. తప్పులను త్వరగా సరిదిద్దుకొని వరుసగా 5 విజయాలు అందుకుంది. తామేం తక్కువ కాదని నిరూపించుకుంది. నిజానికి హార్దిక్ సేనకు తొలి ఓటమిని రుచిచూపించింది కేన్ మామ బృందమే! అందుకే ఈ సారి ఏం జరుగుతుందో అన్న ఆసక్తి నెలకొంది.
బౌలింగే బలం!
గుజరాత్, హైదరాబాద్ (GT vs SRH) బౌలింగ్ యూనిట్లు అత్యంత బలంగా ఉన్నాయి. టైటాన్స్ ఇన్ని విజయాలు సాధించిందంటే అందుకు బౌలర్లే కారణం. లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ ప్రత్యర్థిని తక్కువ స్కోర్లకే పరిమితం చేస్తున్నారు. డెత్‌లో తక్కువ ఎకానమీతో పరుగులు ఇస్తూ వికెట్లు తీస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, మార్కో జన్‌సెన్, టి నటరాజన్ చురకత్తుల్లాంటి బంతులు విసురుతున్నారు. బౌలింగ్ పరంగా ఈ రెండు జట్లకు ఇబ్బందేమీ లేదు. ఈ సీజన్లో బెస్ట్ బౌలింగ్ యావరేజ్ సన్‌రైజర్స్ (20.69), టైటాన్స్ (25.79)దే.
హైదరాబాద్ బ్యాటింగ్ భేష్!
బ్యాటింగ్‌లో మాత్రం టైటాన్స్‌తో పోలిస్తే హైదరాబాదే బాగుంది. వన్‌డౌన్‌లో వస్తున్న రాహుల్ త్రిపాఠి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన ప్రతిసారీ రన్స్ కొడుతున్నాడు. అయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్, అభిషేక్ శర్మ రాణిస్తున్నారు. కేన్ మామ ఫామ్‌లోకి వస్తే బాగుంటుంది. టైటాన్స్ మాత్రం పూర్తిగా హార్దిక్ పాండ్యపై ఆధారపడుతోంది. ఏదైనా మ్యాచులో అతడు విఫలమైతే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫర్వాలేదు. రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, మిల్లర్ అప్పుడప్పుడు మ్యాచులు ఫినిష్ చేస్తున్నారు.
GT vs SRH Probable Xi
గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమి, యశ్ దయాల్
సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మార్‌క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జే సుచిత్ / వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, మార్కో జన్‌సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్