ఐపీఎల్‌లో సోమవారం రాత్రి పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (63: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం పంజాబ్ ఓవర్లలో 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 142 పరుగులు చేసింది.
ఆదుకున్న మిషెల్ మార్ష్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0: 1 బంతి) మొదటి బంతికే లియాం లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ ఆ ఒత్తిడి జట్టుపై పడకుండా మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్ (32: 16 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), మిషెల్ మార్ష్ వేగంగా ఆడారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 29 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. ఈ జోడి భాగస్వామ్యం బలపడుతున్న దశలో అర్ష్‌దీప్ సింగ్.. సర్ఫరాజ్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపించాడు.
ఆ తర్వాత వచ్చిన లలిత్ యాదవ్ (24: 21 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)... మిషెల్ మార్ష్‌కు చక్కటి సహకారం అందించాడు. మూడో వికెట్‌కు వీరు 47 పరుగులు జోడించారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ను కూడా అర్ష్‌దీప్ సింగే బ్రేక్ చేశాడు. లలిత్ యాదవ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. లలిత్ అవుటయ్యాక ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. రిషబ్ పంత్ (7: 3 బంతుల్లో, ఒక సిక్సర్), రొవ్‌మన్ పావెల్ (2: 6 బంతుల్లో) విఫలం అయ్యారు. దీనికి తోడు అక్షర్ పటేల్ బంతులు వృథా చేశాడు.
దీంతో మిషెల్ మార్ష్ మీద ఒత్తిడి పడింది. తను భారీ షాట్లకు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది. 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్ష్ కూడా అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితం అయింది. పంజాబ్ బౌలర్లలో లియాం లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. కగిసో రబడ ఒక వికెట్ తీశాడు.
ఆరంభం అదరగొట్టినా...
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ వేగంగానే ప్రారంభం అయింది. మొదటి వికెట్‌కు ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (28: 15 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), శిఖర్ ధావన్ (19: 16 బంతుల్లో, మూడు ఫోర్లు) 3.5 ఓవర్లలోనే 38 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న బెయిర్‌స్టోను అవుట్ చేసి నోర్జే ఢిల్లీకి మొదటి వికెట్ అందించాడు.
అయితే ఆ తర్వాత భనుక రాజపక్స (4: 5 బంతుల్లో, ఒక ఫోర్), లియాం లివింగ్ స్టోన్ (3: 5 బంతుల్లో), మయాంక్ అగర్వాల్ (0: 2 బంతుల్లో), హర్‌ప్రీత్ బ్రార్ (1: 2 బంతుల్లో), రిషి ధావన్ (4: 13 బంతుల్లో) దారుణంగా విఫలం కావడంతో పంజాబ్ 82 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రాహుల్ చాహర్ (25 నాటౌట్: 24 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), జితేష్ శర్మ (44: 34 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) పంజాబ్‌ను ఆదుకున్నారు. భారీ షాట్లు ఆడుతూ పంజాబ్ శిబిరంలో ఆశలు చిగురింపజేశారు.
అయితే కీలక సమయంలో జితేష్ అవుట్ కావడం... రాహుల్ చాహర్‌కు సరైన సహకారం అందించేవారు కరువవడంతో పంజాబ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 142 పరుగులకు పరిమితం అయింది. ఢిల్లీ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా... అక్షర్, కుల్దీప్ యాదవ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆన్రిచ్ నోర్జే ఒక వికెట్ పడగొట్టాడు.