IPL 2022 DC vs PBKS More Covid 19 Cases Reported in Delhi Capitals Camp Still Waiting For full Report Says BCCI : ఐపీఎల్ 2022లో 32వ మ్యాచుపై సందిగ్ధం నెలకొంది. నేడు ముంబయి వేదికగా జరగాల్సిన పంజాబ్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ (DC vs PBKS) మ్యాచుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దిల్లీ క్యాంపులో మరికొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ మ్యాచును ఆడిస్తారా? లేదా షెడ్యూలు చేస్తారా? అన్న విషయం ఇప్పటివరకు బీసీసీఐ చెప్పలేదు.
దిల్లీ క్యాపిటల్స్‌లో మొదట ఫిజియో ప్యాట్రిక్ ఫర్హర్ట్‌కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దాంతో ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరం మొత్తాన్ని ప్రత్యేక బయో బుడగలో ఉంచారు. ఇతరులతో కలవనీయడం లేదు. మరో రెండు రోజులకు మిచెల్ మార్ష్‌కు పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని డీసీ మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. దాంతో బుధవారం పుణెలో జరగాల్సిన మ్యాచును ముంబయికి మార్చారు. ప్రయాణాలు చేయనీయడం లేదు.
ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరంలో ప్రతిరోజు కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. మంగళవారం నిర్వహించిన టెస్టుల్లో ఆటగాళ్లకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం వచ్చింది. అయితే బుధవారం ఉదయం టెస్టులు చేసి అందులో నెగెటివ్ వస్తే మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ నిర్వాహక కమిటీ భావిస్తోంది. కానీ ఈ టెస్టుల్లో మరికొందరు ఆటగాళ్లు, సిబ్బందికి పాజిటివ్ వచ్చిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. పరీక్ష ఫలితాలను బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
పంజాబ్‌తో మ్యాచ్ నిర్వహించాలంటే దిల్లీ బృందంలో 12 మంది ఆటగాళ్లకు నెగెటివ్ రావాల్సి ఉంటుంది. అందులో ఏడుగురు భారతీయులు కచ్చితంగా ఉండాలి. లేదంటే ఈ మ్యాచును టెక్నికల్ కమిటీ రీషెడ్యూలు చేస్తుంది.
'నెగెటివ్ వచ్చిన ఆటగాళ్లు ఇతరులను కలవకుండా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా కొందరు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు వచ్చాక నిర్ణయం తీసుకుంటాం' అని బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్‌కు తెలిపారు. 'ఏప్రిల్ 16 నుంచి దిల్లీ శిబిరం మొత్తానికి ప్రతిరోజూ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. ఏప్రిల్ 19న నాలుగో రౌండ్ టెస్టులు చేశారు. దాదాపుగా నెగెటివ్ వచ్చింది. బుధవారం ఉదయం మరోసారి నిర్వహించారు. ఫలితాలు తెలియాల్సి ఉంది' అని బీసీసీఐ అధికారి వివరించారు.