ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మూడో విజయం లభించింది. ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో ఎటువంటి మార్పూ చేయలేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓడినా నాలుగో స్థానంలోనే ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిచినా తొమ్మిదో స్థానంలోనే ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా ఎక్కువగా ఉండటం, చెన్నై రన్‌రేట్ చాలా తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
అదరగొట్టిన ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి సన్‌రైజర్స్ బౌలర్ల నుంచి ఏమాత్రం ప్రతిఘటన ఎదురు కాలేదు. నిదానంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రుతురాజ్ గైక్వాడ్ (99: 57 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు), డెవాన్ కాన్వే (85 నాటౌట్: 55 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు) గేర్లు క్రమంగా మారుస్తూ వెళ్లారు. సన్‌రైజర్స్ బౌలర్లకు ఎక్కడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మొదటి 10 ఓవర్లలో చెన్నై ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు సాధించింది.
మొదటి వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యం అందించిన అనంతరం సెంచరీకి ఒక్క పరుగు దూరంలో రుతురాజ్ అవుటయ్యాడు. చివర్లో డెవాన్ కాన్వే వేగంగా ఆడటంలో చెన్నై 200 పరుగుల మార్కును దాటగలిగింది. చివరి ఓవర్లో డెవాన్ కాన్వే రెండు బౌండరీలు సాధించాడు. చాలా కాలం తర్వాత వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన ధోని (8: 7 బంతుల్లో, ఒక ఫోర్) అంత ప్రభావం చూపించలేకపోయాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టాడు.
పూరన్ అదరగొట్టినా...
203 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. మొదటి వికెట్‌కు కేవలం 5.5 ఓవర్లలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ (39: 24 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), కేన్ విలియమ్సన్ (47: 37 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) 58 పరుగులు జోడించారు. అయితే వరుస బంతుల్లో అభిషేక్ శర్మ, ఫాంలో ఉన్న రాహుల్ త్రిపాఠి (0: 1 బంతి) అవుట్ కావడంతో రైజర్స్ కష్టాల్లో పడింది.
ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్ (17: 10 బంతుల్లో, రెండు సిక్సర్లు), కేన్ విలియమ్సన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 30 పరుగులు జోడించాక ఎయిడెన్ మార్క్రమ్ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే వేగంగా ఆడే ప్రయత్నంలో విలియమ్సన్ కూడా వికెట్ కోల్పోయాడు. చివర్లో నికోలస్ పూరన్ (64: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) వేగంగా ఆడినా... తనకు మరో ఎండ్‌లో సపోర్ట్ లభించలేదు. దీంతో రైజర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి నాలుగు వికెట్లు తీయగా... మిషెల్ శాంట్నర్, ప్రిటోరియస్‌లకు చెరో వికెట్ దక్కింది.