ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో విజయం. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారీ స్కోరు చేసిన లక్నో
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (77: 51 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు), క్వింటన్ డికాక్ (23: 13 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మొదటి వికెట్‌కు 26 బంతుల్లోనే 42 పరుగులు జోడించారు. అనంతరం శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన క్వింటన్ డికాక్.. లలిత్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో లక్నో తన మొదటి వికెట్ కోల్పోయింది.
ఆ తర్వాత కేఎల్ రాహుల్‌తో కలిసి దీపక్ హుడా (52: 34 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కేఎల్ రాహుల్ ప్రారంభంలో కొంచెం నిదానంగా ఆడినప్పటికీ మెల్లగా వేగం పెంచాడు. మరో ఎండ్‌లో దీపక్ హుడా మొదట్నుంచి వేగంగా ఆడాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్లో కేఎల్ రాహుల్, 14వ ఓవర్లో దీపక్ హుడా తమ వ్యక్తిగత అర్థ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 61 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అర్థ సెంచరీ అవ్వగానే దీపక్ హుడా అవుట్ అవ్వడంతో వీరి భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ (17 నాటౌట్: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) క్రీజులోకి వచ్చాడు. తను వేగంగా పరుగులు చేయలేకపోవడంతో మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి పెరిగింది. రన్‌రేట్ కూడా భారీగా పడిపోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో మూడో బంతికి సిక్సర్ కొట్టిన కేఎల్ రాహుల్, నాలుగో బంతికి లలిత్ యాదవ్ పట్టిన అద్భుత క్యాచ్‌కి అవుటయ్యాడు. అయితే చివరి ఓవర్లో ముస్తాఫిజుర్ టైట్‌గా బౌలింగ్ వేయడంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో కోల్పోయిన మూడు వికెట్లనూ శార్దూల్ ఠాకూరే తీశాడు.
పంత్ రాణించినా...
ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌కు వారు ఆశించిన ఆరంభం లభించలేదు. ఫాంలో ఉన్న ఓపెనర్లు పృథ్వీ షా (5: 7 బంతుల్లో), డేవిడ్ వార్నర్ (3: 4 బంతుల్లో) మూడు ఓవర్లలోపే అవుటయ్యారు. దీంతో ఢిల్లీ 13 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఆ తర్వాత మిషెల్ మార్ష్ (37: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు), రిషబ్ పంత్ (44: 30 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) బీస్ట్ మోడ్ చూపించారు. మూడో వికెట్‌కు కేవలం 25 బంతుల్లోనే 60 పరుగులు జోడించారు.
మిషెల్ మార్ష్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన లలిత్ యాదవ్ (3: 4 బంతుల్లో) విఫలం అవ్వడం, రిషబ్ పంత్ కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఢిల్లీ 120 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్ (42 నాటౌట్: 24 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు), రొవ్‌మన్ పావెల్ (35: 21 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) ఢిల్లీని ఆదుకున్నారు. అయితే కీలక సమయంలో రొవ్‌మన్ పావెల్ అవుట్ కావడం, అక్షర్ పటేల్‌కు తోడుగా మరో బ్యాటర్ లేకపోవడంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 189 పరుగులకే పరిమితం అయింది.