Ambati Rayudu Catch: ఐపీఎల్‌ 2022లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Superkings) తొలి విజయం అందుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఆ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. అభిమానులను ఆనందపరిచింది. ఈ మ్యాచులో తెలుగు క్రికెటర్‌ అంబటి రాయుడు (Ambati Rayudu) డైవ్‌ చేసి పట్టిన క్యాచ్‌ అందరినీ అబ్బురపరిచింది. ఇంకా చెప్పాలంటే చాలామంది స్టన్ అయ్యారు.


బెంగళూరు ఛేదనలో 16 ఓవర్‌ను రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వేశాడు. తొలి బంతికే హసరంగ సిక్సర్‌ కొట్టి తన ఇంటెన్షన్‌ ఏంటో చెప్పేశాడు. ఆ తర్వాత బంతినీ భారీ సిక్సర్‌ బాదబోయి జోర్డాన్‌కు క్యాచ్‌ ఇచ్చేశాడు. దాంతో ఆర్సీబీ కష్టాల్లో పడింది. మూడో బంతిని వదిలేసిన ఆకాశ్‌దీప్‌ నాలుగో బంతిని సింపుల్‌గా ఆడాడు. అతడి బ్యాటుకు తగిలిన బంతి గాల్లోకి లేచింది. అక్కడే షార్ట్‌పిచ్‌లో ఉన్న అంబటి రాయుడు షార్ట్‌ కవర్‌ వైపు గాల్లోకి డైవ్‌ చేసి కుడి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో ఇలాంటి సూపర్‌ మ్యాన్‌ ఫీట్లను రాయుడు ఎలా చేశాడబ్బా అని నెట్టింట్లో చర్చలు మొదలయ్యాయి.


ప్రస్తుతం అంబటి రాయుడి వయసు 36 ఏళ్ల. వయసు పెరుగుతున్న అతడిలో ఫిట్‌నెస్‌, కసి, పట్టుదల ఏ మాత్రం తగ్గలేదు. బ్యాటుతో పరుగులు వరద పారిస్తూనే ఉన్నాడు. మైదానంలో చురుగ్గా ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఈ సీజన్లో 4 ఇన్నింగ్సుల్లో 20 సగటు, 126 స్ట్రైక్‌రేట్‌తో 82 పరుగులు చేశాడు. శివమ్‌ దూబె, రాబిన్‌ ఉతప్ప నాటు కొట్టుడుతో ఈ మ్యాచులో రాయుడికి బ్యాటింగ్‌ అవకాశం రాలేదు. కానీ ఫీల్డింగ్‌తో తన వంతు పాత్ర పోషించాడు.




RCB మ్యాచులో CSK జోరు ఇదే!


IPL 2022: ఐపీఎల్‌ 2022లో ఎట్టకేలకు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ (Chennai Superkings) తొలి గెలుపు  అందుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (Royal Challengers Banglore)పై 23 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 217 పరుగుల టార్గెట్‌ను రక్షించుకుంది. ఆర్సీబీని 193/9కి పరిమితం చేసింది. బెంగళూరులో ప్రభుదేశాయ్‌ (34; 18 బంతుల్లో 5x4, 1x6), షాబాజ్‌ (41; 27 బంతుల్లో 4x4), దినేశ్ కార్తీక్‌ (34; 14 బంతుల్లో 2x4, 3x6) టాప్‌ స్కోరర్లు. అంతకు ముందు సీఎస్‌కేలో శివమ్‌ దూబె (95; 46 బంతుల్లో 5x4, 8x6), రాబిన్‌ ఉతప్ప (88; 50 బంతుల్లో 4x4, 9x6) చితకబాదారు.


శివమ్‌, ఉతప్ప దంచుడే దంచుడు


నిజానికి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కోరుకున్న ఆరంభమేమీ దక్కలేదు. జట్టు స్కోరు 19 వద్ద రుతురాజ్ గైక్వాడ్‌ (17) ఔటయ్యాడు. 36 వద్ద మొయిన్‌ అలీ (3) రనౌట్‌ అయ్యాడు. పవర్‌ప్లేలో ఆ జట్టుకు 35 పరుగులే లభించాయి. ఎప్పుడైతే శివమ్‌ దూబె వచ్చాడో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బెంగళూరు స్పిన్నర్ల బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. లాగిపెట్టి సిక్సర్లు బాదేశాడు. 30 బంతుల్లోనే 50 పూర్తి చేశాడు. మరోవైపు రాబిన్‌ ఉతప్ప సైతం అతడికి జత కలిశాడు. 33 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. పది ఓవర్లు ముగిశాక వీరిద్దరూ ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. ప్రతి ఓవర్‌కు సగటున 1౩-15 పరుగులు రాబట్టారు. బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. మూడో వికెట్‌కు 74 బంతుల్లో 165 పరుగుల భాగస్వామ్యం అందించారు. దాంతో 16.2 ఓవర్లకు 150, 18.3 ఓవర్లకు 200 స్కోరు దాటేసింది. సెంచరీకి చేరువైన ఉతప్ప, రవీంద్ర జడేజాను హసరంగ ఔట్‌ చేశాడు. దూబె మాత్రం ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. సెంచరీకి కొద్ది దూరంలో ఆగిపోయాడు. హర్షల్‌ పటేల్‌ లేని లోటు బెంగళూరును బాగా వేధించింది.