Anushka Sharmas celebration goes viral as Virat Kohli regains lost form: ఆహా..! ఎన్నాళ్లో వేచిన ఉదయం రానే వచ్చింది! రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఓ అందమైన హాఫ్ సెంచరీ చేసి అభిమానులను అలరించాడు. అతడి సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)ను ఆనందంలో ముంచెత్తాడు. అతడి సెలబ్రేషన్స్‌కు తోడుగా అనుష్క శర్మ చీరింగ్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించింది.
ఐపీఎల్ 2022లో 43వ మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. బ్రౌబర్న్ మైదానం ఇందుకు వేదిక. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 170 పరుగులు చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. సీజన్ మొదటి నుంచి నిరాశ పరుస్తున్న అతడు నేడు హాఫ్ సెంచరీ చేశాడు. 45 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఆరు ఫోర్లు, ఒక సిక్స్ బాదేశాడు.
విరాట్ ఇన్నింగ్స్ ఎంతో ప్రత్యేకంగా సాగింది. జట్టు స్కోరు 11 పరుగుల వద్దే సహచరుడైన డుప్లెసిస్ డకౌట్ కావడంతో కోహ్లీ నెమ్మదిగా ఆడాడు. ఆఫ్‌సైడ్ బంతులకు తొందర పడలేదు. ఇన్‌స్వింగర్లు వస్తే చక్కని హెడ్ పొజిషన్‌తో అడ్డుకున్నాడు. దొరికిన బంతినే బౌండరీకి తరలించాడు. రజత్ పాటిదార్‌తో కలిసి సింగిల్స్, డబుల్స్ తీశాడు. చక్కని కవర్‌డ్రైవులను బాదేసి హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. అయితే అతడు బౌండరీ బాదిన ప్రతిసారీ డగౌట్లో ఉన్న అనుష్క శర్మ అరుస్తూ, నవ్వుతూ సందడి చేసింది. అతడిని ఎంకరేజ్ చేసింది. హాఫ్ సెంచరీ కాగానే బిగ్గరగా అరిచింది. స్ట్రైక్‌రేట్ ఎక్కువగా లేకున్నా 14 ఐపీఎల్ మ్యాచుల తర్వాత అతడి బ్యాటు నుంచి హాఫ్ సెంచరీ రావడంతో అంతా సంతోషించారు. దాంతో వీరిద్దరి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.