Ambati Rayudu Retirement Drama: చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు (Amabati Rayudu) రిటైర్మెంట్ డ్రామా ముగిసింది! అతడు ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడం లేదని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. 2022 తర్వాత అతడు తమతోనే ఉంటాడని స్పష్టం చేశారు.
శనివారం మధ్యాహ్నం క్రికెటర్ అంబటి రాయుడు చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు అందరికీ షాకిచ్చాడు! ఐపీఎల్ 2022 తన చివరి సీజన్ అని పేర్కొన్నాడు. వచ్చే ఏడాది నుంచి లీగ్ ఆడబోనని వెల్లడించాడు. ఇంతకు ముందే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అతడు ఇప్పుడు లీగ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చేశాడు. కానీ అంతలోనే మళ్లీ తన ట్వీట్ డిలీట్ చేశాడు.
'ఇదే నా చివరి ఐపీఎల్ అని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది! ఈ లీగు ఆడుతూ అద్భుతమైన సమయం గడిపాను. 13 ఏళ్ల పాటు రెండు గొప్ప జట్లకు ప్రాతినిధ్యం వహించాను. ఈ అద్భుతమైన జర్నీకి ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రేమ పూర్వక ధన్యవాదాలు' అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. మళ్లీ 15 నిమిషాల్లోనే రాయుడు తన మనసు మార్చుకున్నట్టు అనిపిస్తోంది! వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.
ఈ ఘటన జరిగిన కొన్ని గంటలకు సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ మాట్లాడారని తెలిసింది. 'నో, అంబటి రాయుడు రిటైర్ కావడం లేదు. బహుశా తన ప్రదర్శన పట్ల అసంతృప్తితో ఉన్నాడేమో. అందుకే అలా ట్వీట్ చేసి ఉంటాడు. ఇదంతా ఒక సైకలాజికల్ విషయం. నేను చెప్తున్నా, అతడు మాతోనే ఉంటాడు' అని ఆయన స్పష్టం చేశారు. ఏదేమైనా రెండు మూడు గంటల పాటు అంబటి రాయుడు అటు సీఎస్‌కే ఇటు తన ఫ్యాన్స్‌ను సందిగ్ధంలో పడేశాడు.
అంబటి రాయుడు ఈ సీజన్లో 12 మ్యాచుల్లో కేవలం 271 పరుగులు చేశాడు. సగటు 27. స్ట్రైక్‌రేట్ 124. మొత్తంగా అతడి కెరీర్ స్ట్రైక్‌రేట్‌తో పోలిస్తే ఇది తక్కువే. మొత్తంగా ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాలా ఇబ్బందులకు గురైంది. రవీంద్ర జడేజా కెప్టెన్సీ వదిలేశాడు. మళ్లీ ధోనీ పగ్గాలు అందుకున్నాడు. ఆటగాళ్లలో నిరాసక్తి కనిపిస్తోంది.