IPL 2024: ఐపీయల్ ఫీవర్ అమాంతం పెరిగిపోయింది క్రికెట్ అభిమానుల్లో. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఒక్కొక్కరు తమ టీంలతో కలుస్తున్నారు. ఆయా ప్రాంఛైజీలు వారికి గ్రాండ్‌వెల్‌కమ్ చెబుతున్నాయి. కోచ్‌లు ప్రత్యర్ధి టీం బలాబలాలు అంచనాల్లో మునిగితేలగా... ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. మెజార్టీ ఆటగాళ్లకి ఇండియా పరిస్థితులు అలవాటే. ఈసారి వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉండబోతోంది అన్న ఆసక్తి ఒకవైపు ఉంటే... అనామక ఆటగాళ్లు కూడా ఐపీయల్ లో చెలరేగిపోయిన సందర్భాలను ఫ్యాన్స్ గుర్తు చేసుకొంటున్నారు. మొత్తంగా ఐపీయల్ అంటేనే రికార్డుల పుస్తకం. మరి అలాంటి కొన్ని రికార్డులు 4వ నంబర్‌తో ముడిపడి ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం...
చెన్నై నాటు..నాటు
ఐపీయల్ అంటే చెలరేగి ఆడే చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు ఐపీయల్ లో అత్యధిక టీం స్కోర్ విభాగంలో చెన్నైను నాల్గో స్థానంలో ఉంచారు. టైటిళ్ళ మీద టెటిళ్లు ఎగరేసుకుపోయే చెన్నైసూపర్‌కింగ్స్ 2010 ఏప్రిల్ 30న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డ్ స్కోరు సాధించారు. అంతే కాదు టైటిల్ ని కూడా ఎగరేసుకుపోయారు. తమ సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ తరహాలో విరుచుకుపడుతుంటే రాజస్థాన్ రాయల్స్ఆటగాళ్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు.
కింగ్ కోహ్లీ
ఇక రికార్డ్ ల రారాజు విరాట్ కోహ్లి ఐపీయల్ లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో నాలుగో స్థానంలోఉన్నాడు. 237 మ్యాచ్ లు ఆడి ఎన్నో రికార్డులు తన ఖాతాలో వేసుకొన్నఈ స్టార్ ప్లేయర్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడి జాబితాలో 4వ ప్లేస్ దక్కించుకొన్నాడు. 2008లోనే ఐపీయల్ ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ... రికార్డ్ లను అలవోకగా తన పేరిట లిఖించుకోవడం అలవాటు చేసుకొన్నాడు. ఎక్కువ పరుగుల జాబితాలో అగ్రస్థానం లో ఉన్న విరాటుడు ఈ సారి సీజన్‌లో ఈ రికార్డ్ లను మరింత మెరుగుపరచడం ఖాయం.
డివిలియర్స్ షో...
ఇక మిస్టర్ 360... ఏబీ డివిలియర్స్ ఐపీయల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ విభాగంలో 4వ స్థానంలో ఉన్నాడు. 225 స్ట్రైక్‌రేట్ తో ఏబీ ఇన్నింగ్స్ సాగింది. కేవలం 59 బంతుల్లో 133 పరుగులు సాధించాడు డివిలియర్స్. ఈ ఇన్నింగ్స్‌లో డివిలియర్స్ ఆడిన స్కూప్ షాట్లు తనని మిస్టర్ 360 గా మార్చేశాయి.
గంభీరమైన కెప్టెన్
ఐపీయల్‌లో ఎక్కువ మ్యాచ్ లకు కెప్టెన్సీ చేసిన ఆటగాడిలో గౌతమ్ గంభీర్ నాల్గో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి నాయకత్వం వహించి కోల్‌కతా కథనే మార్చేసాడు కెప్టెన్ గంభీర్. ఈ మాజీ టీం ఇండియా ఆటగాడు మొత్తం 129 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసి తమ టీంకు 71 విజయాలు అందించాడు. నైట్‌రైడర్స్‌కి తన కెప్టెన్సీలో 2012లో ఐపీయల్ టైటిల్ అందించి జట్టుకు మధురానుభూతి మిగిల్చాడు గౌతమ్. తన కెప్టెన్సీలో జట్టు 55 శాతం విజయాలు సాధించింది.
రికార్డ్ రాహుల్
కె.యల్.రాహుల్ ఐపీయల్ లో ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఐపీయల్ అత్యధిక సెంచరీల రికార్డులో 4వ స్థానంలో ఉన్న రాహుల్ 2013 లో ఈ మెగా టోర్నీలో ఎంట్రీ ఇచ్చాడు. అప్పట్నుంచీ ఆడుతున్న రాహుల్ ప్రస్తుతం లక్నోసూపర్‌జెయింట్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓపెనర్ గా వచ్చే రాహుల్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ చాలానే ఆడాడు. 46 సగటుతో బ్యాటింగ్ చేసే రాహుల్ క్రీజ్‌లో ఉన్నాడు అంటే భారీ స్కోరు ఖాయం అని ఫ్యాన్స్ అంటుంటారు.
మ్యాక్సీ..మాయ
ఐపీయల్ లో ఎక్కువ స్ట్రైక్‌రేట్ కలిగి ఉన్న ఆటగాళ్లలో 4వ స్థానంలో ఉన్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. 2023 ప్రపంచకప్‌లో ఒంటిచేత్తో తమ టీంను గెలిపించుకొన్న ఈ ధీరుడు ఇక ఐపీయల్ అంటేచాలు శివాలెత్తుతాడు. 157.62 స్ర్టైక్‌రేట్ తో 4వ స్థానంలో తిష్టవేసుకొని కూర్చున్న మ్యాడ్‌మ్యాక్సీ ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ అందించేందుకు కంకణం కట్టుకొన్నాడు. అవసరమైనప్పుడు బాల్‌తోనూ జట్టు విజయానికి కృషి చేస్తాడు ఈ స్టార్‌ప్లేయర్.
మన్‌దీప్ సున్నా సింగ్
ఐపీయల్ లో ఎక్కువ సార్లు డకౌట్ అయ్యిన నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు మన్‌దీప్‌సింగ్. కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన ఈ ఆటగాడు 15 సార్లు డకౌట్ అయ్యి ఇలా తన టీంకు నిరాశే మిగిల్చాడు. అంతేకాదు సున్నా పరుగులతో వికెట్ చేజార్చుకొని తన టీంని ఇంకా కష్టాల్లో నెట్టాడు. ఎందుకంటే తను బ్యాటింగ్ చేసే మిడిలార్డర్ లో తను కీలకం కాబట్టి టీంకు పరుగులేవీ చేయకుండానే 15సార్లు ఇలా వికెట్ పారేసుకొన్నాడు.
మిశ్రా మాయాజాలం
ఐపీయల్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లుతీసిన వారిలో నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు అమిత్‌మిశ్రా. 173 వికెట్లని తన లెగ్‌స్పిన్ ద్వారా సాధించడమే కాదు అలవోకగా హ్యాట్రిక్ వికెట్లని తన ఖాతాలో వేసుకొన్నరికార్డ్ కూడా మనోడిఖాతాలోనే ఉంది. తన స్లో డెలివరీలు అర్ధంకాక బ్యాట్స్‌మెన్ వికెట్లు పారేసుకొనేవారు. 7.36 ఎకానమీతో పరుగులు కూడా నియంత్రించడం మిశ్రా స్పెషల్.
ఢిల్లీ..ధమాకా
2023 ఏప్రిల్ 20 న జరిగిన మ్యాచ్ లో కోల్‌కతాతో తలపడిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లతో విజయం సాధించింది. స్పల్పస్కోర్లు నమోదయిన ఈ మ్యాచ్‌లో మ్యాచ్ ఆసాంతం ఆసక్తి కలిగించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 127 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 128 పరుగుల లక్ష్యఛేదనలో బ్యాటింగ్ ఆరంభించిన ఢిల్లీ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. డేవిడ్ వార్నర్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. 4 వికెట్ల విజయం ఢిల్లీకి ఆనందాన్ని ఇస్తే టోర్నీలో కోల్‌కతాకి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
ఇది ఊతప్ప స్పెషల్
అత్యధిక వికెట్లు తీసిన వికెట్‌కీపర్‌గా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు రాబిన్ ఊతప్ప. చెన్నై సూపర్‌కింగ్స్ టీంలో ఆడిన ఈ హార్డ్ హిట్టర్ కోల్‌కతా, పుణె లాంటి టీమ్ తరఫున ఆడినప్పుడు వికెట్‌కీపింగ్ చేశాడు. 114 ఇన్నింగ్స్‌లో 90 వికెట్లు పడగొట్టాడు రాబిన్ ఊతప్ప. అందులో 82 క్యాచ్‌లు, 24 స్టంపింగ్‌లు చేశాడు. బౌలర్‌తో కలిసి ఒక ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టడం రెండు సార్లు సాధించాడు. 2022 లో ఐపీయల్ నుంచి నిష్క్రమించాడు ఊతప్ప .