Cricket News: ఇండియన్ ప్రీమియర్ లీగ్ - ఐపీఎల్లో రాయల్ చాలెంజర్ బెంగళూరుకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇప్పటివరకు ఒక్కసారి కూడా కప్పు సాధించక పోయినా, ప్రతి ఏడాది ఈ వర్ష కమ్ నామ్దే అంటూ అభిమానులు జట్టును ఉత్సాహ పరుస్తారు. ఇక టోర్నీలో రెండుసార్లు ఫైనల్ కు చేరినా, రెండుసార్లూ హైదరాబాద్ ఫ్రాంచైజీ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే. 2009లో డెక్కన్ ఛార్జర్స్ చేతిలో, 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్సీబీ ఓటమిపాలైంది. అయితే ఈ సీజన్ లో కొత్త నాయకుడి కోసం జట్టు అన్వేషిస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. తాజాగా దీనిపై టీమిండియా క్రికెటర్ రజత్ పాటిదార్ స్పందించాడు.
తప్పకుండా చేస్తా..
ఆర్సీబీ యాజమాన్యం తనకు సారథిగా పగ్గాలు అప్పగిస్తే తప్పకుండా స్వీకరిస్తానని పాటిదార్ పేర్కొన్నాడు. 2025 సీజన్ కు సంబంధించి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతోపాటు పాటిదార్ ను జట్టు రిటైన్ చేసుకుంది. అయితే గత సీజన్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ను వేలంలోకి వదిలేసి మళ్లీ తీసుకోలేదు. ఇక, కెప్టెన్సీకి కోహ్లీ విముఖంగా ఉన్నాడని వార్తలు వస్తున్న క్రమంలో ఆర్సీబీ కెప్టెన్ గా తనకు అవకాశం వస్తే తీసుకుంటానని తెలిపాడు. తనపై నమ్మకంతోనే జట్టు రిటైన్ చేసుకుందని, తనపై కెప్టెన్సీ బాధ్యతలు పెడితే తప్పకుండా తీసుకుంటానని చెప్పాడు. ఇక గతవారం ముగిసిన ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో మధ్యప్రదేశ్ ను తన సారథ్యంలో పాటిదార్ ఫైనల్ వరకు చేర్చాడు. ఎవరూ ఊహించని విధంగా స్ఫూర్తిదాయక ఆటతీరుతో జట్టును తుదిపోరుకు అర్హత సాధించింది. ఆర్సీబీ ఈ విషయాన్ని కనుక పరిగణనలోకి తీసుకుంటే తనకు సారథ్యం దక్కే అవకాశముంది.
గతాన్ని మరిచి, ముందుకు సాగుతున్నాను..
ఇక భారత జట్టులోకి ఎంపికై తిరిగి బయటకు వచ్చిన విషయాన్ని త్వరగా మరిచిపోయినట్లు పాటిదార్ పేర్కొన్నాడు. దేశవాళీల్లో సత్తాచాటి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ ఏడాది కోహ్లీ గైర్హాజరీలో ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో తొలిసారి పాటిదార్ జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. అయితే పేలవమైన ఆటతీరుతో ఉద్వాసనకు గురయ్యాడు. ఇక ఆ సిరీస్ లో మూడు టెస్టుల్లో భాగంగా ఆరు మ్యాచ్ లాడిన పాటిదార్.. కేవలం 63 పరుగులే చేసి తీవ్రంగా నిరాశ పడ్డాడు. అయితే ఆ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుని, తిరిగి దేశవాళీల్లో టన్నుల కొద్ది పరుగులు సాధిస్తున్నాడు. ఇక రంజీల్లో మధ్యప్రదేశ్ కెప్టెన్ గా వ్యవహరించిన పాటిదార్.. 53.37 సగటుతో 427 పరుగులు చేశాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో 347 పరుగులతో హయ్యెస్ట్ రన్ స్కోరర్ గా నిలిచాడు. ఈ టోర్నీలో 182కు పైగా స్ట్రైక్ రేటుతో తను పరుగులు సాధించాడు. మరి, వచ్చే సీజన్ కోసం పాటిదార్ ను ఆర్సీబీ కెప్టెన్ గా చేస్తుందా అనేది ఆర్సీబీ అభిమానులకు ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా నిలిచింది.
Also Read: Year Ender 2024: విశ్వ వేదికపై సత్తా చాటిన భారత ప్లేయర్లు - పలు టోర్నీలో జెండా ఎగుర వేసిన క్రీడాకారులు