2024Flashback 2024: ఈ ఏడాది క్రీడా రంగంలో భారత్‌కు కలిసొచ్చింది. హాకీ, షూటింగ్, వ్యక్తిగత క్రీడలైన చెస్, జావెలిన్ త్రోలో కూడా భారత ఆటగాళ్లు రాణించారు. 2024 లో చాలా టోర్నీలు జరిగాయి. ముఖ్యంగా పారిస్ ఒలింపిక్స్ , T20 ప్రపంచ కప్ , అథ్లెటిక్స్‌లో డైమండ్ లీగ్ ఫైనల్, మహిళల హాకీలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరిగాయి. ఈ టోర్నీల్లో భారత ఆటగాళ్ల ప్రతిభా పాటవాలుతెలుసుకుందాం?
17 ఏళ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్ చిక్కింది..
రోహిత్ శర్మ సారథ్యంలో 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌లో ఓడిపోయింది. అంతలోనే మరో ప్రపంచకప్ వచ్చింది. వెస్టిండీస్‌లో జరిగిన T20 ప్రపంచ కప్‌లో టీమిండియా మరోసారి ఫైనల్‌కు చేరుకుంది, అక్కడ దక్షిణాఫ్రికాతో తలపడింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో ప్రొటీస్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి టీ20 క్రికెట్ చరిత్రలో భారత్ రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఇంగ్లాండ్, వెస్టిండీస్ సరసన చేరింది.
పారిస్ ఒలింపిక్స్‌లో 6 పతకాలు
ఒలింపిక్స్‌లో పతకాల సంఖ్యను రెండంకెల స్థాయికి తీసుకెళ్లడంలో భారత బృందం విఫలమైనా అభిమానులు అదేమీ పట్టించుకోలేదు. మను భాకర్ షూటింగ్‌లో 2 కాంస్య పతకాలు సాధించి సత్తా చాటింది. షూటింగ్‌లో పతకం పొందిన తొలి మహిళా ప్లేయర్ తను కావడం విశేషం..ఇక జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. మొత్తానికి షూటింగ్‌లో భారత్ 3 పతకాలు, అథ్లెటిక్స్, హాకీ, రెజ్లింగ్‌లో ఒక్కో పతకం సాధించింది.
పారాలింపిక్స్‌లో భారత్‌దే ఆధిపత్యం
ఈ ఏడాది పారాలింపిక్స్ చరిత్రలో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మొత్తం 29 పతకాలు సాధించింది. భారత్‌కు మొత్తం 29 పతకాలు రాగా, గతసారి కంటే 10 పతకాలు ఎక్కువగా మన ప్లేయర్లు సాధించడం విశేషం. భారత్ ప్లేయర్లకు అథ్లెటిక్స్‌లో 17, బ్యాడ్మింటన్‌లో 5, షూటింగ్‌లో 4, ఆర్చరీలో 2, జూడోలో ఒక పతకం లభించింది.
ఆర్చరీ ప్రపంచకప్‌లో 15 పతకాలు కొల్లగొట్టారు..
ఏప్రిల్ లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ లో మనోళ్లు దుమ్ము దులిపారు. ఇందులో భారత ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేసి మొత్తం 15 పతకాలు సాధించారు. ఆ టోర్నీలో భారత్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలను గెలుచుకుంది. భారత్‌కు చాలా పతకాలు టీమ్ ఈవెంట్‌లలో వచ్చాయి. అయితే వ్యక్తిగత ఈవెంట్లలోనే మనోళ్లు చాలా గట్టి పోటి ఇచ్చారు.
18 ఏళ్లకే ప్రపంచ చెస్ ఛాంపియన్ తో ప్రపంచ రికార్డు
దొమ్మరాజు గుకేశ్.. 18 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ గెలిచి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. ఫైనల్లో 14వ రౌండ్‌లో చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు.
ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీని మహిళల హస్తగతం..
మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన వాడిని మరోసారి చాటింది. మొత్తం టోర్నీలో అజేయంగా నిలిచి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను భారత హాకీ జట్టు గెలుచుకుంది. ఫైనల్‌లో చైనాను 1-0తో ఓడించి టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత మహిళల హాకీ జట్టు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలవడం ఇది మూడోసారి. ఇలా ఈ ఏడాది భారత జట్టు అటు క్రీడాకారులకు ఇటు అభిమానులకు తీయని గుర్తులు మిగిల్చింది.
Also Read: Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం