BGT Series 3rd Test: ఐదు టెస్టుల బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో బ్రిస్బేన్ లో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ ఎదురీదుతోంది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ చాలాసార్లు నిలిచిపోయింది. అందుకే ఎర్లీగా టీ విరామాన్ని కూడా తీసుకున్నారు. టీ బ్రేక్ కు భారత్ 14.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 48 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (52 బంతుల్లో 30 బ్యాటింగ్, 4 ఫోర్లు) ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనకు కెప్టెన్ రోహిత్ శర్మ (0 బ్యాటింగ్) సహకారం అందిస్తున్నాడు. 


టాపార్డర్ విఫలం..
మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో షరామాములుగానే భారత టాపార్డర్ మరోసారి కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ (4) తొలి బంతినే బౌండరీకి పంపి మంచి టచ్ లోనే కనిపించినా, మిషేల్ స్టార్క్ బౌలింగ్ లో ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్ వద్ద మిషెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఇక వన్ డౌన్ వచ్చిన శుభమాన్ గిల్ (1) కూడా వెంటనే వెనుదిరిగాడు. ఆఫ్ స్టంప్ ఆవతలికి వచ్చిన బంతిని డ్రైవ్ చేయగా, స్లిప్పులో మార్ష్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడంతో వెనుదిరిగాడు.


మరోసారి కోహ్లీ విఫలం


భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (3) వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. కోహ్లీ ఆఫ్ స్టంప్ బలహీనతను సొమ్ము చేసుకున్న పేసర్ జోష్ హేజిల్ వుడ్ ఎనిమిదో వికెట్ పై బంతిని సంధించగా, కోహ్లీ డ్రైవ్ ఆడాడు. బాడీ నుంచి చాలా దూరంగా వెళుతున్న బంతి కావడంతో బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లో పడింది. ఆ తర్వాత రిషభ్ పంత్ (9) కాసేపు ఓపికగా ఆడినా తనను ఆసీస్ సారథి పాట్ కమిన్స్ పెవిలియన్ కు పంపాడు. పంత్ కూడా కీపర్ కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ క్రీజులోకి రావడంతో మళ్లీ వర్షం మొదలైంది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపేసి విరామం ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 397 పరుగులు వెనుకంజలో ఉంది. 


Also Read: IND vs AUS: బ్రిస్బేన్‌లో భారత్‌ ముందు భారీ స్కోర్‌- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌; బుమ్రాకు 6 వికెట్లు


445 పరుగులకు ఆసీస్ ఆలౌట్..
అంతకుముందు సోమవారం మూడోరోజు ఓవర్ నైట్ స్కోరు 405/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్.. 445 పరుగులకు ఆలౌటైంది. ఉదయం 16 ఓవర్లకుపైగా బ్యాటింగ్ చేసిన కంగారూలు.. మరో 40 పరుగులు జోడించి ఔటయ్యారు. కేరీ (70 నాటౌట్) అజేయంగా నిలిచాడు. ముందుగా స్టార్క్ ను బుమ్రా పెవిలియన్ కు పంపి మ్యాచ్ లో ఆరు వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నేథన్ లయోన్ ను మహ్మద్ సిరాజ్ బౌల్డ్ చేయగా, చివరిదైన హేజిల్ వుడ్ వికెట్ ను ఆకాశ దీప్ దక్కించుకున్నాడు. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ ను భారత్ 295 పరుగులతో గెలవగా, రెండోటెస్టును ఆసీస్ పది వికెట్లతో సొంతం చేసుకుంది. 

Also Read: Sports Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు వీళ్లే- లిస్టులో షాకింగ్ ప్లేయర్లు