Hyderabad Weather Today: 


సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచుకు వర్షం ముప్పు పొంచివుంది. ఉప్పల్‌ మైదానంలో నేటి మ్యాచుకు వరుణుడు అంతరాయాలు కల్పించే ప్రమాదం లేకపోలేదు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు మరో వారం రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెబ్‌సైట్లు అంటున్నాయి.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ రెండు జట్లకు ఎంతో కీలకం. ఇందులో గెలిచిన జట్టుకే ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఆరెంజ్‌ ఆర్మీ గెలిస్తే వారికి మరింత కుషన్ లభిస్తుంది. ఒకవేళ మ్యాచ్‌ రద్దైనా, ఫలితం తేలకపోయినా చెరో పాయింటు పంచుకోవాల్సి వస్తుంది. దాంతో ప్లేఆఫ్ దారులు దాదాపుగా మూసుకుపోతాయి.


ఉప్పల్‌ మైదానంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. అరగంట ముందే టాస్‌ వేస్తారు. అయితే గురువారం మధ్యాహ్నం వర్షం కురిసేందుకు 13 శాతం అవకాశం ఉందని ఆక్యూవెదర్‌ వెబ్‌సైట్‌ సూచిస్తోంది. ఇక రాత్రి పూటైతే 33 శాతం వర్షం కురుస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మ్యాచ్‌ జరిగే సమయంలో చిరు జల్లులు కురవొచ్చని.. ఒకట్రెండు సార్లు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రత 35 డిగ్రీల కన్నా తక్కువే ఉంటుందని, రాత్రి పూట 24 డిగ్రీల వరకు ఉంటుందని వివరించింది.


వారం రోజులుగా హైదరాబాద్‌ నగరంలో వరుసగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల వరదలు వస్తున్నాయి. మరో వారం రోజుల పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదు. కనీసం చెదురుమదురు జల్లులైనా పడతాయని సమాచారం. ఇప్పటికే లక్నోలో ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. లక్నో వర్సెస్‌ చెన్నై మ్యాచు వరుణుడి వల్ల మధ్యలోనే ఆగిపోయింది. దాంతో చెరో పాయింట్‌ పంచేశారు.


ఉప్పల్ పిచ్‌ రిపోర్ట్‌


వాతావరణం చల్లగా ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. వర్షం కురిసే అవకాశం ఉండటంతో పిచ్‌ను కవర్లతో కప్పేశారు. దాంతో వికెట్‌పై తేమ ఉంటుంది. అంటే ఫాస్ట్‌ బౌలర్లకు పిచ్‌ అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ఈ వేదికలో స్పిన్నర్లు విజయవంతం అయ్యారు. 7.70 ఎకానమీతో పరుగులు ఇచ్చారు. 19.3 బంతులకు వికెట్‌ చొప్పున పడగొట్టారు. బ్యాటర్లు జాగ్రత్తగా ఆడితేనే పరుగులు వస్తాయి.


సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, అయిడెన్ మార్ క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్, కార్తీక్ త్యాగి, ఫజల్‌హాక్ ఫరూఖీ, అన్మోల్‌ప్రీత్ సింగ్, అఖిల్ కుమార్ రెడ్డి, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ దాగర్, ఉపేంద్ర యాదవ్, సంవీర్ సింగ్, సమర్థ్ వ్యాస్, విక్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, ఆదిల్ రషీద్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్.


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: నితీష్ రాణా, రహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, టిమ్ సౌథీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, మన్‌దీప్ సింగ్, లిటన్ దాస్, కుల్వంత్ ఖేజ్రోలియా, డేవిడ్ వైస్, సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, ఎన్ జగదీశన్.